సాక్షి, తమిళసినిమా: సాధారణంగా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. అదే నటులైతే పాత్ర స్వభావాన్ని బట్టి బరువు పెరగడానికో, తగ్గడానికో కసరత్తులు చేస్తుంటారు. అంతేకానీ పాత్ర కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నటుడిని చూసి ఉండం. అయితే దర్శకుడు కలెంజయమ్‌ను చూసిన తరువాత ఇలాంటి వారు కూడా ఉంటారని నమ్మాల్సి వస్తుంది.
ఇంతకు ముందు పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కలైంజయమ్‌లో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఇటీవల నటనపై అధిక దృష్టిసారిస్తున్న ఈయన ఈ మధ్య విడుదలైన కనవు తొళిల్‌సాలై చిత్రంలో యాంటీ కిడ్నాపింగ్ అధికారిగా నటించి మెప్పించారు. అయితే అంతకు ముందు కలైంజయమ్‌కు, ఈ చిత్రంలోని కలైంజయమ్‌కు అసలు పొంతనే లేదనిపించింది. అంతగా ఆ పాత్ర కోసం మారిపోయారు.
అంతగా మార్పునకు కారణం ఏమిటన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ, కనవు తొళిల్‌సాలై చిత్రంలో హిందువుల దేవుళ్ల విగ్రహాలను అక్రమంగా తరళింపును అరికట్టే అధికారి పాత్ర ఉంది నటిస్తారా? అయితే ఆ పాత్ర కోసం మీరు పూర్తిగా మారిపోవాలి. ముఖ్యంగా మీ శరీర రంగు మార్చుకోవాలి అని ఆ చిత్ర దర్శకుడు టి.కృష్ణసామి అడిగారన్నారు. దాన్ని తాను ఛాలెంజ్‌గా తీసుకుని చెన్నై ప్లాస్టిక్ సర్జరీ వైద్య నిపుణుడు కార్తీక్‌ను కలిసి తన రంగు మార్పు గురించి చర్చించానన్నారు.
ఆయన మూడు నెలలు కష్టపడి తన శరీర రూపాన్ని పూర్తిగా మార్చేశారని అన్నారు. ఆ తరువాత దర్శకుడు కృష్ణసామి చెప్పిన యాంటీ కిడ్నాపింగ్ అధికారి ఇర్ఫాన్ గా మారి ఆయన ముందు నిలిచానన్నారు.ఆయన తనను చూసి షాక్ అయ్యారని, వృత్తిపై తన శ్రద్ధను చూసి కనవు తొళిల్‌సాలై చిత్రంలో నటించే అవకాశం కల్పించారన్నారు ఇందులో తన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు.