
కుట్టి.. పొన్ను.. అబ్బాయి!
హీరో రామ్, దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘నేను శైలజ’. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మరో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్రవంతి మూవీస్, పీఆర్ సినిమా సంస్థలపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించ నున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రారంభం కానుంది.
‘నేను శైలజ’లో మలయాళీ బ్యూటీ కీర్తీ సురేశ్ కథానాయికగా నటించారు. తాజా సినిమాలో మరో మలయాళ కుట్టి (అమ్మాయి) అనుపమా పరమేశ్వరన్‌ను ఓ నాయిక గా, తమిళ పొన్ను (అమ్మాయి) మేఘా ఆకాశ్‌ను నాయికగా ఎంపిక చేశారు. ఆమెకు తెలుగులో తొలి అవకాశమిది. తమిళంలో ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’లో మేఘా ఆకాశ్ నటిస్తున్నారు.
‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ – ‘‘నేను శైలజ’లో రామ్‌ను సరికొత్తగా చూపించిన దర్శకుడు కిశోర్ తిరుమల తాజా సినిమాలోనూ సరికొత్త లుక్, బాడీ లాంగ్వేజ్‌తో చూపించబోతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమేరా: సమీర్‌రెడ్డి.