
బంపర్ ఆఫర్!
బాలీవుడ్ కథానాయిక అనుష్కా శర్మ ఓ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ప్రస్తుతం కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న అనుష్క ఓ క్రేజీ ప్రాజెక్టును దక్కించుకున్నారు. ‘రబ్ నే బనాదే జోడీ’తో యశ్‌రాజ్ సంస్థ ద్వారా తెరంగేట్రం చేసిన ఈ అందాల తార మళ్లీ ఇదే సంస్థ నిర్మిస్తున్న ‘సుల్తాన్’ చిత్రంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు జోడీగా నటించే చాన్స్ దక్కించుకున్నారు. ఈ చిత్ర కథాంశం ఓ రెజ్లర్ చుట్టూ సాగుతుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు.
మొదట్లో దీపికా పదుకొనే, కంగనా రనౌత్, కృతీసనన్, పరిణీతి చోప్రా లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చినా చివరికు అనుష్కా శర్మ వైపు మొగ్గు చూపారు దర్శక-నిర్మాతలు. ‘రబ్ నే బనాదే జోడీ’, ‘జబ్ తక్ హై జాన్’, ‘పీకే’ చిత్రాల్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్‌లతో ఆన్ స్క్రీన్‌లో మంచి కెమిస్ట్రీ పండించిన అనుష్క, మరి సల్మాన్‌కి కూడా సరిజోడీ అనిపించుకుంటారా? లేదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.