
‘దిల్ సే’ అంటే... ఫ్రమ్ ద హార్ట్ (‘గుండె లోతుల్లోంచి’ అనొచ్చు) అని మీనింగ్! షారూఖ్ ఖాన్, మనీషా కోయిరాల జంటగా దర్శకుడు మణిరత్నం తీసిన ‘దిల్ సే’ కూడా ప్రేక్షకుల గుండె లోతుల్లోని తడిని తట్టి లేపింది. ఎందరో ఆ సినిమాకు తమ హృదయంలో గుడి కట్టేశారు. అటువంటి ప్రేక్షకుల్లో అనుష్కా శర్మ కూడా ఒకరు. షారూఖ్ సరసన ‘రబ్ నే బనాదీ జోడీ’, ‘జబ్ తక్ హై జాన్’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాల్లో నటించిన అనుష్కకు అతని ‘దిల్ సే’ అంటే చచ్చేంత ప్రేమ అట! అంతే కాదు... ఆ సినిమాను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మళ్లీ తీయాలని కోరుకుంటున్నారు.
ఇంకా అనుష్కా శర్మ మాట్లాడుతూ– ‘‘ఐ లవ్ ద మూవీ ‘దిల్ సే’. దాన్ని రీమేక్ చేస్తే... నేను మనీషా కోయిరాల పాత్రలో నటిస్తా. అందులో ఆమె పాత్ర, ఆమె నటించిన విధానం నాకెంతో నచ్చాయి’’ అని పేర్కొన్నారు. మనీషా కోయిరాల పాత్రలో నటించాలనుందని అనుష్కా శర్మ మనసులో మాటను బయట పెట్టేశారు. మరి, షారూఖ్ ఖాన్ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది? ఆలోచించండి! ఇంతకీ, దర్శకుడు మణిరత్నం అనుష్కా శర్మ మాటలను విన్నారో? లేదో? ‘దిల్ సే’ను రీమేక్ చేసే ఆలోచన ఆయనకు ఉందంటారా? లేదంటారా? వెయిట్ అండ్ సీ!!
Comments
Please login to add a commentAdd a comment