
తన తండ్రిని విమర్శించిన వారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా దీటుగా సమాధానం ఇచ్చారు.
ముంబై: తన తండ్రిని విమర్శించిన వారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా దీటుగా సమాధానం ఇచ్చారు. రెహమాన్ ఆస్కార్ అవార్డు సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఇటీవల ఓ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో రెహమాన్, ఖతీజాల భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అదేసమయంలో విమర్శలు కూడా వచ్చాయి. ఖతీజా బుర్ఖాలో రావడంతో కొంతమంది విమర్శనాస్త్రాలు సంధించారు. రెహమాన్ సంకుచిత స్వభావం కలవాడని, బుర్ఖా ధరించాలని కూతురిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. దీనిపై ఖతీజా ఫేక్‌బుక్‌లో స్పందించింది.
‘నా జీవితం పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను. నాకు నచ్చిన దుస్తులు ధరిస్తాను. వాస్తవ పరిస్థితులు తెలియకుండా దయచేసి సొంత తీర్పులు ఇవ్వకండి. ఇటీవల జరిగిన వేడుకలో వేదికపై మా నాన్నతో జరిపిన నేను జరిపిన సంభాషణపై మంచి స్పందన వచ్చింది. అలాగే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. నా తండ్రి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కొంతమంది విమర్శించారు. ఇలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే. వ్యక్తిగత స్వేచ్ఛను నా తల్లిదండ్రులు గౌరవిస్తారు. బుర్ఖా వేసుకోవడం నాకు ఇష్టం. బుర్ఖా ధరించడాన్ని గౌరవంగా భావిస్తాన’ని ఖతీజా వెల్లడించింది.
విమర్శకుల నోళ్లు మూయించేందుకు రెహమాన్ కూడా తన ట్విటర్‌లో ఓ ఫొటో షేర్ చేశారు. నీతా అంబానీతో తన భార్య సైరా, కుమార్తెలు ఖతీజా, రహీమ దిగిన ఫొటోను ‘ఫ్రీడం టూ చూజ్’ పేరుతో ట్విటర్‌లో పెట్టారు. ఖతీజా మినహా సైరా, రహీమ బుర్ఖాలు లేకుండానే ఉన్నారు. తన ఇష్టప్రకారమే ఖతీజా బుర్ఖా ధరించిందని ఈ ఫొటో ద్వారా స్పష్టం చేశారు. (మనస్సాక్షే దారి చూపుతుంది!)
The precious ladies of my family Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose pic.twitter.com/H2DZePYOtA
— A.R.Rahman (@arrahman) February 6, 2019