మళ్లీ ఆస్కార్ రేస్‌లో...
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2009)కి జంట ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అప్పటి నుంచి ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండేళ్లకు ‘127 హవర్స్’ చిత్రానికిగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’, ‘బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్’ విభాగాల్లో నామినేషన్ దక్కించుకున్నారాయన. అయితే ఆస్కార్ వరించలేదు. తాజాగా మళ్లీ ఆయన ఆస్కార్ బరిలో నిలిచారు.
బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జీవితం ఆధారంగా రూపొందిన ‘పీలే: బర్త్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రానికి గాను రెహమాన్ ఆస్కార్ రేస్‌లో ఉన్నారు. ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో రెహమాన్ పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుంది. జనవరి 24న నామినేషన్ దక్కించుకున్నవారి వివరాలను ప్రకటిస్తారు. మరి.. ఈ నామినేషన్ ఎంట్రీ పోటీలో రెహమాన్‌కి స్థానం దక్కుతుందా? నామినేషన్ గెల్చుకుంటే ఆస్కార్ దక్కించుకుంటారా? అనేది వేచి చూడాలి.