
రెహ్మాన్ వల్లే ‘ఐ’ ఆలస్యం
సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ కారణంగా ఐ చిత్రం విడుదల ఆలస్యం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఐ. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇది. విక్రమ్, ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీత బాణీలందిస్తున్నారు. చిత్ర నిర్మాణం పూర్తయి, ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నట్లు దర్శక నిర్మాతలు ఇంతకు ముందే ప్రకటించారు. అయితే సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ పాటలకు ఇంకా ట్యూన్స్ అందించకపోవడంతో ఆడియో విడుదల కార్యక్రమం ఆలస్యం అవుతోందని, దీంతో చిత్ర విడుదల మరింత ఆలస్యం అవుతోందని సమాచారం.
రెహ్మాన్ బాణీలు కట్టిన తరువాత దర్శకుడు గీతాన్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఎ.ఆర్.రెహ్మాన్ వెంటబడి సాంగ్స్ రికార్డింగ్ చేయించుకుంటున్నారట. చిత్ర ఆడియో ఆవిష్కరణను కెనడాలో భారీ ఎత్తున నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన కంటే ప్రముఖ వ్యక్తి అతిథిగా విచ్చేస్తారని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. అయితే ఆయన పేరును వెల్లడించడానికి నిరాకరించారు.