అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం ఆమె కుటుంబాన్నే కాక యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నేటికి కూడా శ్రీదేవి కుటుంబం ఈ విషాదం నుంచి కోలుకోలేదు. ఈ గడ్డు పరిస్థితుల్లో బోని కపూర్ మొదటి భార్య సంతానం అయిన అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌లు, శ్రీదేవి పిల్లలకు తోడుగా ఉన్నారు. శ్రీదేవి మరణం వీరందరిని ఒక్కటి చేసిందని చెప్పవచ్చు. కొన్ని నెలలుగా అర్జున్ కపూర్ తన చెల్లెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లతో చాలా సన్నిహితంగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
ఈ సందర్భంగా అర్జున్ కపూర్, జాన్వీ కపూర్‌లు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్జున్ కపూర్, శ్రీదేవి మరణం తరువాత సంభవించిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. ‘మన జీవితంలో జరిగే కొన్నే సంఘటనలు మనపై చాలా ప్రభావం చూపిస్తాయి. నా జీవితంలో అలాంటి సంఘటన మా అమ్మ(మోనా శౌరి) మరణం. ఆ సమయంలో మనకు తోడుగా నిలిచే వారు ఎంత అవసరమో నాకు, అన్షులాకు బాగా అర్ధమయ్యింది. మాకు వచ్చిన పరిస్థితే జాన్వీ, ఖుషిలకు వచ్చింది. కానీ మేము, వారు(జాన్వీ, ఖుషిలు) కూడా మాలానే బాధపడాలని కోరుకోలేదు’ అన్నారు.
ఒక వేళ ఆ సమయంలో మా అమ్మ బతికి ఉన్నా కూడా ‘ముందు మీరు అక్కడికి వెళ్లండి.. ఇలాంటి సమయంలో ఎటువంటి కోపం పెట్టుకోకూడదు. జీవితం చాలా చిన్నది’ అని చెప్పేది అన్నారు. శ్రీదేవి మరణించిన సమయంలో అన్షులా కూడా తనలానే ఆలోచించిందంటూ అర్జున్ కపూర్ గుర్తు చేసుకున్నారు. ‘అప్పుడు సమయం రాత్రి 2 గంటలవుతుంది అనుకుంటా.. నేను ఈ విషయం అన్షులాతో ఎలా చెప్పలా అని అలోచిస్తున్నాను. కానీ ధైర్యం చేసి వెళ్లి చెప్పాను. అప్పుడు అన్షు నన్ను అడిగిన మొదటి ప్రశ్న వారిద్దరు(జాన్వి, ఖుషి) ఎక్కడ’ అంటూ అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 శ్రీదేవి దుబాయిలో కార్డియాటిక్ అటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment