
ప్రత్యేక గీతంలో అర్జున్ కపూర్
చిత్ర పరిశ్రమలో ‘ప్రత్యేక గీతాల్లో’ నర్తించేందుకు కొన్నాళ్ల క్రితం వరకూ ప్రత్యేకంగా నటీమణులను తీసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మంచి పారితోషికం, క్రేజ్ కోసం స్టార్ హీరోయిన్‌లు సైతం స్పెషల్ సాంగ్స్ వైపు మక్కువ చూపుతున్నారు. అయితే ఇన్నాళ్లు ‘ఐటం గర్ల్స్’కు మాత్రమే సొంతమైన ఈ పాటల్లో ఇక ‘ఐటం బాయ్స్’ కూడా రాబోన్నారు. బాలీవుడ్ చరిత్రలోనే ‘ఐటం బాయ్’గా కాలు కదపనున్న తొలి హీరోగా అర్జున్ కపూర్ నిలవనున్నారు.
ఈ యువ హీరో తన కజిన్ హర్షవర్ధన్ కపూర్ నటిస్తున్న ‘భవేష్ జోషి సూపర్‌హీరో’ చిత్రంలో ‘చుమ్మే మేన్ చవాన్‌ప్రాష్’ పాటలో కనిపించబోతున్నాడు. ప్రత్యేక గీతంలో అర్జున్ తోపాటు ‘దండేకర్ సిస్టర్స్’ అనుషా, షిబానీ నర్తించనున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లో వీరు ముగ్గురూ మాంచి రంగు రంగులు దుస్తుల్లో ఐటం తారలకు ధీటుగా మెరిసిపోతున్నారు. ‘మిర్జ్యా’ చిత్రం తర్వాత హర్షవర్ధన్ నటిస్తున్న చిత్రం ‘భవేష్ జోషి సూపర్‌హీరో’. ఈ చిత్రంలో హర్షవర్ధన్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఫాంటమ్ ఫిల్మ్స్ బ్యానర్లో, విక్రమాదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.