రోబో 2 కోసం హాలీవుడ్ సూపర్స్టార్
చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న శంకర్ 'రోబో 2' కు ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే కథ రెడీ చేసిన శంకర్ నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. తొలి భాగంలో నటించిన రజనీ హీరోగా మరోసారి నటిస్తాడన్న విషయం ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. హీరోయిన్స్, విలన్ కోసం వేట కొనసాగుతోంది.
'రోబో 2' తెర మీదకు వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా లో విలన్గా హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ చేత చేయించాలని ప్రయత్నించాడు శంకర్. తన గత సినిమా 'ఐ' ఆడియో వేడుకకు కూడా ఆర్నాల్డ్ ను ఆహ్వానించి తన సినిమాల రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో చూపించాడు. అయితే అప్పట్లో సినిమా కథ రెడీ కాకపోవటంతో ఆర్నాల్డ్ నుంచి ఎలాంటి హామీ రాలేదు.
ఇటీవలే 'రోబో 2' కథను ఫైనల్ చేసిన శంకర్ మరోసారి ఆర్నాల్డ్ నటించే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పటివరకు ఆర్నాల్డ్, తన అంగీకరం తెలపకపోయినా 'రోబో 2'లో నటించటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ కత్రినా కైఫ్, దీపిక పదుకొనేలు నటించనున్నారు. రజనీ పుట్టిన రోజు డిసెంబర్ 12న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.