హీరో చెల్లెలి బర్త్ డే పార్టీ భగ్నం
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ బర్త్ డే పార్టీకి అనుకోని అతిథులు వచ్చారు. తన 26వ పుట్టినరోజును పురస్కరించుకుని గతవారం పాలీ హిల్స్ లోని తన నివాసంలో గతవారం అర్పిత ప్రిబర్త్ డే పార్టీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు.
తెల్లవారుజాము వరకు పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు తెల్లవారుజామున 2.30 గంటలకు అర్పిత ఇంటి తలుపు తట్టారు. అనుకోని అతిథులుగా వచ్చిన పోలీసులను చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టి చుట్టపక్కలవారికి నిద్రాభంగం కలిగించిందుకు మహారాష్ట్ర పోలీసు చట్టం కింద కేసు నమోదు చేశారు. రూ. 12 వేల జరిమానా విధించి, సంగీతం ఆపుజేయించారు. తన గారాల చెల్లెలు పుట్టినరోజు పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో సల్మాన్ ఖాన్ నొచ్చుకున్నాడట. తర్వాత రోజు ఆదివారమైనా షూటింగ్ కు వెళ్లిపోయాడట.