
కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఆర్య
దర్శకుడు కేవీ ఆనంద్, నటుడు ఆర్య కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ధనుష్ హీరోగా రూపొందించిన అనేగన్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత కేవీ ఆనంద్ తెరకెక్కించే చిత్రంలో నటించే హీరో ఎవరన్న విషయం గురించి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల శివకార్తీకేయన్ నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అది అసత్యప్రచారం అని కేవీ ఆనంద్ ఖండించారు. తాజాగా ఆర్య నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇదే సంస్థ ఇంతకు ముందు కేవీ ఆనంద్ దర్శకత్వంలో మాట్రాన్, అనేగన్ చిత్రాలను నిర్మించిందన్నది గమనార్హం.
ఆర్య హీరోగా మదరాసుపట్టణం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్నీ ఏజీఎస్ సంస్థనే నిర్మించింది. ఇకపోతే ఆర్య ప్రస్తుతం ఇంజిఇడుప్పళగి చిత్రంతో పాటు బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇంజిఇడుప్పళగి చిత్రంలో నాయకి అనుష్కకే ప్రాధాన్యత ఉంటుంది. ఇక బెంగళూర్ డేస్ రీమేక్ చిత్రంలో ఆర్యతో పాటు బాబీసింహా, రానా నటిస్తున్నారు. ఇంతకు ముందు నటించిన యట్చన్ చిత్రంలోనూ మరో హీరోగా క్రిష్ణ నటించారు. దీంతో సోలో హీరోగా మంచి యాక్షన్ కథా చిత్రం చెయ్యాలని ఆశిస్తున్నట్లు సమాచారం. కేవీ ఆనంద్ కథ తెగ నచ్చడంతో ఆర్య ఆయన దర్శకత్వంలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం.