అధర్వతో ఇద్దరు ముద్దుగుమ్మల రొమాన్స్
ఈ మధ్య ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పవచ్చు. అది కమర్షియల్ చిత్రం అయినా క్లాసికల్ చిత్రం అయినా, హారర్ చిత్రం అయినా, టైమ్ మిషన్ చిత్రం అయినా కావచ్చు. ఇప్పటి వరకూ సింగిల్ హీరోయిన్‌తో సరిపుచ్చుకుంటూ వచ్చిన యువ నటుడు అధర్వ తాజాగా ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తుండడం విశేషం. దివంగత సీనియర్ నటుడు మురళి వారసుడిగా బానాకాత్తాడి చిత్రంలో కథానాయకుడిగా పరిచయం అయిన అధర్వకు ఆ చిత్రం ఆశించిన రిజల్ట్‌ను ఇవ్వకపోయినా వరుసగా అవకాశాలు రాబట్టుకుంటున్నారు.
అలాంటి సమయంలో బాలా దర్శకత్వంలో నటించిన పరదేశీ చిత్రం నటుడిగా అధర్వకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కాస్త వెనకబడినా ఇటీ వల ఈటీ, కణిదన్ చిత్రాలు ఆయనకు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం రుక్మిణి వండి వరుదు చిత్రాన్ని పూర్తి చేసిన అధర్వ తాజాగా చాలా మంది కథానాయకుల మాదిరిగానే సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చమ బోద ఆగదా అనే చిత్రాన్ని నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఇద్దరు నాయికలు ఉండే ఇందులో ప్రముక నటీమణుల్ని నటింపజేయాలని మొదట భావించినా, బడ్జెట్ ఎగిరి కూర్చోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఉత్తరాది భామలు అనైక, మిష్టిలను ఎంపిక చేశారు. వీరిలో అనైక దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం సత్య-2 ద్వారా పరిచయం అయ్యిందన్నది గమనార్హం. తమిళంలోనూ వసంతబాలన్ దర్శకత్వం వహించిన కావయతలైవన్ చిత్రంలో నటించింది.ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించకుండా పోయిన అనైక ఇప్పుడు అధర్వ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుందన్న మాట. మరో హీరోయిన్ మిష్టి హిందీలో సుభాష్‌ఘాయ్ దర్శకత్వం వహించిన కాంచీ చిత్రం ద్వారా పరిచయమైంది.అయితే తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం అవుతుంది.
ఇకపోతే అధర్వ తొలి చిత్రం బానాకాత్తాడి చిత్రానికి దర్శకత్వం వహించిన బద్రి ఈ చమ బోద ఆగదా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది కమర్షియల్ అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో అధర్వకు జంటగా మిష్టి నటిస్తుండగా ఎవరూ నటించడానికి సాహసించని ఒక బోల్డ్ పాత్రలో అనైక నటిస్తోందని తెలిపారు. ఆ పాత్రకు సంబంధించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదన్నారు.అయితే ఇద్దరు హీరోయిన్లకు చిత్రంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.