'అత్తారింటికి దారేది' విడుదల వాయిదా | Attarintiki Daredi release postponed | Sakshi
Sakshi News home page

'అత్తారింటికి దారేది' విడుదల వాయిదా

Published Mon, Aug 5 2013 8:33 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అత్తారింటికి దారేది - Sakshi

అత్తారింటికి దారేది

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి విభజన సెగ తగిలింది. అత్తారింటికి దారి(విడుదల తేది) తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రం విడుదల సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తొలుత ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత హీరో మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా చిత్రం విడువలను వాయిదావేయాలని నిర్మాతలు అనుకుంటున్నట్లు సమాచారం. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఈ సినిమాను విడుదల చేయడం అంత మంచిదికాదని వారు భావిస్తున్నారు. అవకాశం ఉంటే ఈ నెల 14న విడుదల చేయాలన్న ఆలోచనతో  నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తేదీ కాకపోతే  ఉద్యమ పరిస్థితిని బట్టి వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.

రాష్ట్ర విభజన అంశం చిరంజీవి కుటుంబ హీరోల చిత్రాల విడుదలకు అడ్డుతగులుతోంది. కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారి చిత్రాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు.  'అత్తారింటికి దారేది' సినిమాకు ఇబ్బందిలేకుండా ఉండేదుకు గానీ లేక మరే కారణం వల్లనో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' సినిమా విడుదలను వాయిదా వేశారు. ముందు ప్రకటించిన ప్రకారం ఆ చిత్రం  జులై 31న  విడుదల కావాలసి ఉంది. దానిని  21కి వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో  ఆ సినిమా  21న విడుదల అవుతుందో లేదో చెప్పడం కష్టం.

‘ఎవడు' కంటే ముందు విడుదల కావలసిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల వాయిదాపడుతుండటంతో పవర్ స్టార్ పవన్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అదీగాక ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో పూర్తీగా హాస్యరస ప్రధానంగా నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. పవన్ - బ్రహ్మానందంల హాస్యం - మహేష్ బాబు అతిధి పాత్ర - పవన్ కల్యాణ్ పాట....అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.  పవన్ పడిన పాటను యుట్యూబ్లో పెడితే  కేవలం 24 గంటల్లో 3,70,000 మంది వీక్షించారంటే అభిమానులు ఏ రేంజ్లో ఎదురు చూస్తున్నారో ఊహించుకోవచ్చు. పవన్ అభిమానులతోపాటు ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా తమ హీరో ఎటువంటి పాత్ర పోషించాడో చూసేందుకు ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా,  పవన్‌ అత్తగా నదియా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అత్తారింటికి దారి వెతుకులాటలో ఏ తేది ప్రకటిస్తారో వేచి చూడవలసిందే. అభిమానులకు ఇదో పెద్ద ఆశాభంగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement