ఇటు వెంకీ.. అటు నాని అవసరాల రెడీ! | Avasarala Srinivas to work with Nani ? | Sakshi
Sakshi News home page

ఇటు వెంకీ.. అటు నాని అవసరాల రెడీ!

Published Mon, Oct 3 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

ఇటు వెంకీ.. అటు నాని అవసరాల రెడీ!

ఇటు వెంకీ.. అటు నాని అవసరాల రెడీ!

అగ్ర హీరోల్లో ‘విక్టరీ’ వెంకటేశ్‌ది విభిన్నమైన శైలి. వినోదంతో ప్రేక్షకులను నవ్విస్తూనే, మరుక్షణం కంటతడి పెట్టించగలరు. దోసెడు నవ్వులు.. చిటికెడు కన్నీళ్లు.. అంటూ ‘జ్యో అచ్యుతానంద’తో దర్శకుడిగా రెండో సినిమాతోనూ ప్రేక్షకులను ముందు నవ్వించి, ఆ తర్వాత ఏడిపించిన నటుడు అవసరాల శ్రీనివాస్.
 
 ఈ ఇద్దరి కలయికలో.. అంటే వెంకటేశ్ హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీయాలనేది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ ఆలోచన. వెంకీ హీరోగా మొన్నామధ్య విడుదలైన ‘బాబు బంగారం’ తీశారాయన. అవసరాలను కథ రాయమని అడిగారట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
 
 ముందు నాని.. తర్వాత వెంకీ!!
 ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం... వెంకటేశ్‌తో సినిమాకి ముందు అవసరాల శ్రీనివాస్ మరో సినిమా చేయనున్నారు. అందులో నాని హీరో. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల తర్వాత అవసరాలతో హ్యాట్రిక్‌పై సాయి కొర్రపాటి కన్నేశారు. అయితే.. ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదట. ప్రస్తుతం అవసరాల స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే వెంకీ కథపై ఆలోచిస్తారట. ఇప్పుడు హిందీ హిట్ ‘హంటర్’ రీమేక్‌లో అవసరాల హీరోగా నటిస్తున్నారు.
 
  నటుడిగా మరో రెండు మూడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. నాని కూడా హీరోగా బిజీనే. ఇద్దరూ తమ చేతిలోని ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కలసి సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమా పక్కన పెడితే.. దర్శకుడిగా అవసరాల తీసిన రెండు సినిమాలూ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే ఇప్పటివరకూ  చేసిన రెండు చిత్రాలూ ఒక ఎత్తు. ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరో ఎత్తు అనాలి. ఎందుకంటే దాదాపు 75 సినిమాలు చేసిన వెంకీ, పాతిక సినిమాలు చేసిన నానీతో సినిమా అంటే అవసరాలకు సవాలే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement