
‘‘ఇలాంటి థీమ్ సాంగ్ చేయడానికి కొంచెం ధైర్యం కావాలి. విమర్శలు కూడా రావచ్చు. అయినప్పటికీ నా మనసుకు ఏం అనిపిస్తే అది చేశాను. ఆల్రెడీ ఉన్న మార్వెల్ అభిమానులు, కొత్తగా వచ్చే అభిమానులు ఈజీగా కనెక్ట్ అవ్వాలన్న ముఖ్యోద్దేశంతో మార్వెల్ థీమ్ సాంగ్ చేశాం. ఈ సాంగ్ చేయడానికి మరో ముఖ్యకారణం మా అబ్బాయి, మేనల్లుడు. వాళ్లూ మార్వెల్ అభిమానులే’’ అన్నారు ఏఆర్ రెహమాన్. మార్వెల్ కామిక్స్‌లోని సూపర్ హీరోలందరూ కలసి నటించిన సూపర్ హీరోస్ మూవీ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ చిత్రానికి ఇది సెకండ్ పార్ట్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ థీమ్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ‘థానోస్’ పాత్రకు రానా వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్, థీమ్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేశారు. రెహమాన్ మాట్లాడుతూ – ‘‘ట్యూన్ వినగానే రచయిత రాకేందు మౌళికి ఫోన్ చేశాను. ఆయన మంచి లిరిక్స్ అందించాడు. దర్శకుడు జో రుస్సోకి ఈ పాట నచ్చుతుందో లేదో అని భయపడ్డాను.
‘మాకు హిట్ సాంగ్ ఇచ్చారు. థ్యాంక్స్. దీన్ని చైనీస్, జపనీస్ భాషల్లోకి కూడా డబ్ చేద్దాం’ అన్నారు. మనందరికీ కూడా సూపర్ పవర్ ఉంటుంది. దాన్ని గుర్తించి, మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలి’’ అన్నారు. రానా మాట్లాడుతూ – ‘‘మార్వెల్ ప్రయాణం మొదలైనప్పటి నుంచి వాళ్ల సినిమాలు చూస్తున్నాను. సూపర్ హీరో సినిమాలో భాగం అయ్యే అవకాశం రావడం సంతోషంగా ఉంది. డబ్బింగ్ చెబుతున్నప్పుడే థానోస్ పాత్ర నా ఫేవరెట్ అయిపోయింది. ఒకవేళ చేయాలంటే అదే పాత్ర చేస్తాను. రెహమాన్‌గారు థీమ్ సాంగ్ చేయడం వల్ల పరభాష సినిమాలా కాదు సొంత భాష సినిమా అనే ఫీల్ వస్తుంది’’ అన్నారు. ‘‘మార్వెల్ సూపర్ హీరో చిత్రాలకు ఇండియన్ ఫ్యాన్స్ అద్భుతమైన ప్రేమను ఇస్తున్నారు. మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఆడుతుందనుకుంటున్నాను’’ అని విక్రమ్ దుగ్గల్ అన్నారు. ‘‘పాటకి అచ్చ తెలుగు పదాలు వాడాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో ఫ్యాన్‌గా ఉన్నాను. నా ఫ్యానిజమ్‌కు సార్థకత చేకూరిందనుకుంటున్నాను’’ అన్నారు రాకేందు మౌళి.
Comments
Please login to add a commentAdd a comment