విజయనిర్మలగారు చేసిన చిత్రాల సంఖ్యలో సగమైనా...
‘‘ఓ విజయవంతమైన చిత్రం చేసిన తర్వాత తదుపరి చిత్రంపై అంచనాలు పెరగడం సహజం. అందుకే ‘లవ్లీ’ తర్వాత హడావిడిగా సినిమా మొదలుపెట్టకుండా కథా పరంగా జాగ్రత్త తీసుకుంటున్నాను’’ అని దర్శకురాలు బి. జయ అన్నారు. ఆదివారం ఆమె పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకలో సూపర్ హిట్ పత్రికాధినేత, నిర్మాత బీఏ రాజు, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు పాల్గొన్నారు.
బి. జయ మాట్లాడుతూ - ‘‘ఈ ఏడాది ‘తొక్కుడుబిళ్ల’, ‘కలిసుందాం.. కండీషన్స్ అప్లయ్’ పేరుతో రెండు చిత్రాలు, నూతన హీరో సజ్జన్‌తో ఓ చిత్రం చేయబోతున్నాం. వీటిలో ఒకటి మలయాళ చిత్రాల తరహాలో సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ‘తొక్కుడుబిళ్ల’కు పరుచూరి గోపాలకృష్ణ కథ, మాటలు అందిస్తున్నారు. సంగీతదర్శకుడు వసంత్ ఆధ్వర్యంలో వచ్చే నెల పాటలను రికార్డ్ చేస్తాం’’ అని చెప్పారు. మీ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాగార్జున సుముఖత వ్యక్తపరిచారు కదా? అనే ప్రశ్నకు - ‘‘నాగార్జునగారు విభిన్న తరహా చిత్రాలు చేశారు.
ఆయనతో చేయాలంటే సరికొత్త కథ కావాలి. లేడీ డెరైక్టర్‌తో చేసే సినిమా నాకు కొత్తగా ఉండాలని ఆయన కూడా ఉన్నారు. కథ కుదరాలి’’ అన్నారు. దర్శకురాలిగా విజయనిర్మల తనకు ఆదర్శం అని చెబుతూ - ‘‘దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆమెది. పైగా అన్నీ విభిన్న కథాంశం గల చిత్రాలే. విజయనిర్మలగారు చేసిన చిత్రాల సంఖ్యలో సగమైనా చేరాలనుకుంటున్నాను’’ అన్నారు.