
బాహుబలి-2కు చంద్రబాబు భారీ బొనాంజా!
బాహుబలి-2 సినిమాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ బొనాంజా ప్రకటించారు. ఆ సినిమాను ఆరు షోలు ప్రదర్శించుకోడానికి సర్కారు అనుమతించింది. ఉదయం 7 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆరు షోలు ప్రదర్శించుకోడానికి ఓకే చేశారు. సినిమా విడుదల అయినప్పటి నుంచి పది రోజుల పాటు ఇలా ఆరు షోలు ప్రదర్శించేందుకు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో విడుదల
రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోడానికి అనుమతి ఇవ్వాలంటూ టాలీవుడ్ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, కళ్యాణ్, దామోదర్, ప్రసాద్ తదితరులు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధను కలిసి విజ్ఞప్తి చేసిన మర్నాడే ఇలా బాహుబలి-2 సినిమాకు ఆరు షోలకు అనుమతి రావడం గమనార్హం. మొత్తం అన్ని సినిమాలు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వాలని, దాంతోపాటు ప్రేక్షకులకు ఇబ్బంది కలగని రీతిలో టికెట్ల ధరలను పెంచుకోడానికి కూడా అనుమతించాలని వారు కోరారు.