
‘బాహుబలి’ విడుదల కానివ్వం
బెంగుళూరు: తమిళనటుడు, బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ‘బాహుబలి– ది కన్‌క్లూజన్’ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఏప్రిల్ 28న బాహుబలి రిలీజ్ కానున్న వేళ ‘కన్నడ ఒకోటా’ సంస్థ బెంగుళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. ‘కావేరీ జలాల విషయంలో కన్నడిగుల గురించి గతంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు హద్దు దాటాయి. మేం చిత్రాన్ని విడుదల కానివ్వం. మా కార్యకర్తలు ప్రతి జిల్లాలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటారు. కాదు కూడదని రిలీజ్ చేస్తే ఎగ్జిబిటర్లు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఒకోటా అధ్యక్షుడు వతల్ నాగరాజ్ హెచ్చరించారు. ఈ ఆందోళనకు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది.