బిగ్ బ్రాండ్స్ కు నో చెబుతున్న బాహుబలి
బిగ్ బ్రాండ్స్ కు నో చెబుతున్న బాహుబలి
Published Thu, May 11 2017 12:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించిన బాహుబలి-2తో ప్రభాస్ కు వచ్చిన కీర్తి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి హాలివుడ్ దాకా ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. ప్రభాస్ పేరు ఇంతలా మారుమోగుతుంటే, బిగ్ బ్రాండ్స్ చడీచప్పుడు కాకుండా ఎలా కూర్చుంటాయి..! వెనువెంటనే తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా బాహుబలిని నియమించుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించాయి. పెద్ద పెద్ద మొత్తంలో నగదును ఆఫర్ చేస్తూ తమ ప్రొడక్ట్ లకు ఎండోర్స్ చేసుకోవాలని కోరుతున్నాయి. అయితే ప్రభాస్ మాత్రం వాటి ఆఫర్లను సుతిమెత్తంగా తిరస్కరిస్తున్నట్టు తెలిసింది. 18 కోట్ల విలువైన అతిపెద్ద బ్రాండు ఎండోర్స్ మెంట్ ను ప్రభాస్ అంగీకరించలేదని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే ప్రభాస్ దగ్గరికి చాలా బ్రాండ్స్ వచ్చాయని, కానీ ఆయన వేటికీ అంగీకారం తెలుపలేదని పేర్కొన్నారు.
బాహుబలి-2 షూటింగ్ సమయంలోనూ ప్రభాస్ ముందుకు 10 కోట్ల ఎండోర్స్ మెంట్ వచ్చిందని, అయితే సినిమాపైనే దృష్టిసారించిన ప్రభాస్ దాన్ని తిరస్కరించినట్టు రాజమౌళి కూడా తాజాగా రివీల్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎఫెక్ట్ తో ప్రభాస్ కీర్తి కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, భారీ అవకాశాలు ఆయన ముంగిట్లో వాలుతున్నాయి. అయితే తన సొంత కమిట్ మెంట్స్ కే ప్రభాస్ తొలి ప్రాధాన్యమిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మూడు భాషల్లో తెరకెక్కుతున్న సాహోపైనే ప్రభాస్ దృష్టిసారించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.. జూలైలో దీని షూటింగ్ ప్రారంభం కానుంది. కొంతమంది టాప్ బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ హౌజ్ లు ప్రభాస్ ముందుకు కొత్త స్క్రిప్టులతో వస్తున్నారట.
Advertisement