మరో కథ అందిస్తున్న బాహుబలి రచయిత
ముంబయి: బజరంగీ భాయ్‌జాన్ చిత్రానికి కథ అందించి ఉత్తరాదిన సత్తా చాటిన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో బాలీవుడ్ సినిమా కోసం తన కలానికి పని చెబుతున్నారు. 2001లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'నాయక్' చిత్రం సీక్వెల్కు ఆయన కథ అందించబోతున్నారు. దీపక్ ముకుత్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్లో కూడా అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సందర్భంగా ఈరోస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ... తాజా రాజకీయాల నేపథ్యంలో నాయక్ సినిమా సీక్వెల్కు ఇది మంచి తరుణమన్నారు. దీంతో కథ కోసం విజయేంద్ర ప్రసాద్ను సంప్రదించడం జరిగిందన్నారు.
కాగా ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ 2015లో 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలకు కథ అందించారు. 2015లో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాకు కథ అందించినందుకుగాను ఉత్తమ కథకుడిగా ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
ఇక 'నాయక్' చిత్రానికి వస్తే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా 'ఒకే ఒక్కడు' తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్హిట్ అయింది. ఆ సినిమా హిందీ వెర్షన్లో అనిల్ కపూర్, రాణీముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించారు. పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమాకి హిందీలో సీక్వెల్ తీస్తున్నారు.