
మళ్లీ మళ్లీ చూసేలా...!
‘బార్ బార్ దేఖో’... అంటే తెలుగులో ‘మళ్లీ మళ్లీ చూడు’ అని అర్థం. సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఇది. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని కత్రినా కైఫ్ స్టిల్స్ బయటకు రావడం ఆలస్యం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఆ స్టిల్స్‌నే చూస్తున్నారు. తనకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కత్రినా సరిజోడీ అనిపించుకున్నారని స్టిల్స్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఏప్రిల్ నెలలో విడుదలైంది. ఈ నెల 27న ‘కాలా చష్మా..’ అనే పాటను విడుదల చేస్తు న్నారు.
ఇక్కడున్న స్టిల్ ఆ పాటలోదే. నల్లటి కళ్లద్దాలు.. చేతికి గాజులు.. దేశీ డ్రస్సింగ్ స్టైల్.లో కత్రినా లుక్ సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ‘చిక్నీ చమేలీ..’ని గుర్తుకు తెస్తున్నాయి కదూ. అందులో కత్రినా స్టెప్పులకు విపరీతమైన స్పందన లభించింది. అందుకే ‘కాలా చష్మా..’లోనూ అదిరిపోయే స్టెప్స్ వేసి ఉంటారని ఆమె అభిమానులు ఊహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌లో సిద్ధార్థ్, కత్రినాల మధ్య సమ్‌థింగ్ ఏదో జరుగుతోందని వార్తలు రావడం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.