బాహుబ్రేక్!
బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, బిజ్జలదేవ, దేవసేన, అవంతిక... వీళ్లందరూ ఎండలకు భయపడిపోయారా? అందుకే ఇంటి గుమ్మం దాటనన్నారా? చేసేదేం లేక షూటింగ్‌కి సెలవులిచ్చేశారా?... ప్రస్తుతం ‘బాహుబలి- 2’ గురించి ఫిలిమ్‌నగర్‌లో జరుగుతున్న చర్చ ఇది. పైన చెప్పిన పాత్రలన్నీ ఆ సినిమాలోవే అని పిల్లలకు కూడా తెలుసు. ఎండల్లో ఈ పాత్రధారులు పడుతున్న కష్టం చూడలేక దర్శకుడు రాజమౌళి వేసవి సెలవులిచ్చి పంపించేశారనే వార్త ప్రచారంలో ఉంది.
ఈ ప్రచారానికి కారణం ‘బాహుబలి-2’ షూటింగ్‌కి కొన్ని రోజులు విరామం ఇవ్వడమే. మామూలుగా ఏదైనా షూటింగ్‌కి గ్యాప్ ఇస్తే, రకారకాల కథనాలు వస్తుంటాయ్ కదా. ఆ విధంగా ‘బాహుబలి-2’ బ్రేక్‌కి ఎండలు కారణమని చాలామంది ఫిక్స్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే... ఎండల కారణంగా ఈ షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వలేదట. ‘‘ఇది ముందే నిర్ణయించిన బ్రేక్. ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు.
ఎప్పుడో అనుకున్నది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ గ్యాప్‌లో ఈ యూనిట్ అంతా ఏ విహార యాత్రలకు వెళతారేమో అనుకుంటే పొరపాటే. అదేం కుదరదు. బ్రేక్ తర్వాత జూన్‌లో ఆరంభించే షెడ్యూల్ కోసం దాదాపు యూనిట్ అంతా ట్రైనింగ్‌లో పాల్గొంటారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతాయనీ, అలాగే సెట్ వర్క్ కూడా జరుగుతోందనీ శోభు తెలిపారు.
ఇక, ఇటీవల జరిపిన షెడ్యూల్ వివరాల్లోకి వస్తే.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లా విట్‌టేకర్ ఆధ్వర్యంలో భారీ పోరాట దృశ్యాలు చిత్రీకరించారు. అక్టోబర్‌కల్లా సెకండ్‌పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ సమయం పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.