
పెళ్లనగానే అమ్మాయి తరపు బంధువులు.. ముందుగా అబ్బాయికి ఏమైనా ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు చూస్తారు. అయితే ముందూవెనకా ఎంతున్నా తలపై కాసిని వెంట్రుకలు లేకపోతే మాత్రం పెళ్లి కుదరదు అని తేల్చి చెప్పేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. బట్టతల కనిపించకుండా ఉండటం కోసం అబ్బాయిలు పడే పాట్లు చెప్పనలవి కాదు. ఇటీవల ఈ నేపథ్యంపై వచ్చిన సినిమా ‘బాలా’. ఇందులో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా బట్టతల కష్టాలను, దాన్ని కప్పిపుచ్చుకోడానికి పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులో అతనికి భార్యగా నటించిన యామీ గౌతమ్‌కు తాజాగా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులుగా ‘ఎందుకు చేసుకోకూడదు’ అని యామినీ తిరిగి ప్రశ్నించింది. బట్టతల అనేది పెళ్లికి అడ్డు కాదని జవాబిచ్చింది. నిజానికి బట్టతల ఉన్నావారు చాలా శాంతస్వరూపులని అభివర్ణించింది. అయితే, అసలు బట్టతల వ్యక్తులు ముందుగా వాళ్లని వాళ్లు ప్రేమించుకోవాలి.. ఆ తర్వాతే మిగతావాళ్ల నుంచి ప్రేమని కోరాలని.. ఇదే సినిమా ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొంది. బాలా సినిమా విజయం పట్ల యామినీ సంతోషం వ్యక్తం చేసింది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే సినిమాతో ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారని, ఇందులో టిక్‌టాక్ స్టార్‌గా వైవిధ్యభరితమైన పాత్ర చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానంది. నవంబర్ 7న విడుదలైన ‘బాలా’ ఐదు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విజయ ఢంకా మోగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment