‘ఎన్టీఆర్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హీరోగా విశ‍్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (గురువారం) రామకృష్ణ హర్టీ కల్చరల్ సినీ స్టూడియోలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బిజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దర్శకులు రాఘవేంద్ర రావు, బోయపాటి శ్రీను, వివి వినాయక్, పూరి జగన్నాథ్ లతో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు. నందమూరి యువ కథానాయకుడు కళ్యాణ్ రామ్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించిన దానవీర శూర కర్ణ సినిమాలోని ‘రాచరికమా అర్హతలు నిర్ణయించునది’ అనే డైలాగ్‌లను తొలి షాట్‌గా చిత్రీకరించారు. వెంకయ్య నాయుడు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 9 గంటల 42 నిమిషాలకు తొలి షాట్‌ను చిత్రీకరించారు. బాలకృష్ణ స్వయంగా ఎన్‌బీకే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరిలు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తుండగా బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి దసరాకు సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment