ఎన్టీఆర్ పాటకు బాలయ్య స్టెప్స్
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోర్చుగల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రస్తుతం యంగ్ జనరేషన్ హీరోలు తమ ఫ్యామిలీ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు సీనియర్ల పాటలను రీమిక్స్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పటికే ఈ ఫార్ములాతో మంచి సక్సెస్లు సాధించారు.
ఇప్పుడు అదే బాటలో బాలకృష్ణ కూడా ఎన్టీఆర్(సీనియర్) సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేస్తున్నాడు. 1971లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జీవిత చక్రం సినిమాలోని 'కంటి చూపు చెబుతోంది.. కొంటె నవ్వు చెబుతోంది' పాటను పైసా వసూల్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారు. అప్పట్లో శంకర్ జై కిషన్లు సంగీతం అందించిన ఈ పాటను అనూప్ రుబెన్స్ అంతే మధురంగా రీమిక్స్ చేశాడట. బాలకృష్ణ, శ్రియలపై త్వరలోనే ఈ పాటను షూట్ చేయనున్నారు. చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.