
మా ఇద్దరి పాత్రలు నువ్వా-నేనా అనేలా ఉంటాయి - బాలకృష్ణ
‘‘అభిమానం డబ్బుతో కొంటే వచ్చేది కాదు. గుండెలోతుల్లోంచి పెల్లుబికి వచ్చేది. ఇంతమంది అభిమానాన్ని పొందగలగడం నా పూర్వజన్మ సుకృతం. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా.. అని మీతో పాటు నేనూ ఆత్రుతతో ఉన్నాను’’ అని అభిమానులను ఉద్దేశించి బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లెజెండ్’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని శ్రీనువైట్ల ఆవిష్కరించి, బి.గోపాల్‌కి అందించారు. బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘నా వరకూ నిజమైన లెజెండ్ అంటే స్వర్గీయ ఎన్టీఆర్‌గారే. పాత్ర పరంగా మాత్రమే నేను లెజెండ్‌ని. సామాన్యుడికి అన్నవస్త్రాలతో పాటు వినోదం కూడా ఎంతో అవసరం. అందుకే సకలకళల సమ్మేళనమైన సినిమాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి.
దేవిశ్రీ ప్రసాద్ జనరంజకమైన సంగీతాన్ని అందించాడు. దేవిశ్రీ తండ్రిగారు సత్యమూర్తి, నేను చాలా సినిమాలకు పనిచేశాం. అప్పుడు దేవిశ్రీ చాలా చిన్నపిల్లాడు. ఇప్పుడు తన ఎదుగుదల చూస్తుంటే ఆనందంగా ఉంది. జగపతిబాబుది ఇందులో విలన్ పాత్ర అని నేను అనను. మా ఇద్దరి పాత్రలూ నువ్వా- నేనా అనేలా ఉంటాయి. పంచభక్ష్యపరమాన్నాలతో వడ్డించిన విస్తరిలా సినిమాను మలిచాడు బోయపాటి’’ అని చెప్పారు. ‘‘ ‘బాబులకే బాబు లాంటివాడు బాలయ్యబాబు. ఆయన ముందు నన్ను ‘బాబు’ అని పిలవొద్దు’ని సెట్‌లోకి రాగానే అందరికీ చెప్పాను. కానీ అందరూ నన్ను ‘బాబు’ అనే పిలుస్తున్నారు. ఎందుకు అనడిగితే... ‘బాలయ్యే మిమ్మల్ని బాబు అని పిలుస్తున్నారండీ. ఇక మేం పిలవకపోతే ఎలా’ అన్నారంతా. దటీజ్ బాలయ్య. నేను ఇప్పటివరకూ బాలయ్యను యాక్టర్ మాత్రమే అనుకున్నాను. కానీ ఆయన న్యూక్లియర్ రియాక్టర్ అని ఆయనతో పనిచేశాక తెలిసింది’’ అని జగపతిబాబు అన్నారు.
బాలకృష్ణతో పనిచేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమాతో అందరు హీరోలతో పనిచేసిన క్రెడిట్ తనకు దక్కిందని దేవిశ్రీప్రసాద్ ఆనందం వెలిబుచ్చారు. యూనిట్ సభ్యులతో పాటు రాజమౌళి, బాలకృష్ణ అల్లుళ్లు లోకేష్, శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.