ఆరోగ్యకరమైన పోటీ మాది!
బాలకృష్ణ హీరోగా నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ, కథానాయిక శ్రియతో కలసి మీడియాతో సమావేశమయ్యారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ...
► శాతకర్ణి పాత్ర మీకు దక్కినందుకు మీ అనుభూతి ఏంటి?
ఈ సువిశాల దేశాన్ని ఒక్క ఏలుబడి కిందకు తెచ్చిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగువాడని ఎందరికి తెలుసు? మన కంటూ ఓ సంస్కృతిని, వారసత్వాన్ని, ప్రపంచ పటంలో ఓ గుర్తింపుని ఇచ్చిన శాతకర్ణి చరిత్ర... బిడ్డకు పరిచయం లేని పురిటినొప్పుల లాగా పుడమి గర్భంలో కలసింది. ఎన్టీఆర్ వారసుడిగా, తెలుగు బిడ్డగా... ఈ చిత్రం నేను చేయడం కాకతాళీయమో! యాదృచ్ఛికమో! నాకు ఈ అవకాశం నాన్నగారే కల్పించారేమో! నాన్నగారు చేయాలనుకున్న పాత్రని నా వందో చిత్రంలో చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. శాతకర్ణి జననం నుంచి గ్రీకు చక్ర వర్తి డిమిత్రిస్‌ని ఓడించడం దాకా సినిమాలో ఉంటుంది.
► శాతకర్ణి చరిత్రను కథగా రూపొందించడం కష్టమైందా?
‘నాణేలపై తమ బొమ్మ ముద్రించిన మొట్టమొదటి రాజు శాతకర్ణి’ అని కృష్ణశాస్త్రిగారు పురావస్తు శాఖ డైరె క్టర్‌గా పనిచేసిన టైమ్‌లో తెలిసింది. చారిత్రక పరిశోధ కులు పరబ్రహ్మ శాస్త్రిగారు పలు పరిశోధనలు చేసిన తర్వాత ‘శాతకర్ణి తెలుగువాడు’ అని నిరూపించారు. పుస్తకాల్లో శాతకర్ణి గురించి తక్కువ ఉంది. నాసిక్‌లో ‘గౌతమీ బాలాశ్రీ’ వేయించిన శాసనాలు, పుస్తకాలు, అప్పటి శిల్పాల నుంచి సమాచారంతో క్రిష్ స్క్రిప్ట్ రెడీ చేశారు. కథ రూపకల్పనలో ఆయనే ఎక్కువ కష్టపడ్డారు.
► మీకు పౌరాణిక పాత్రల్లో నటించిన అనుభవం ఉంది. శాతకర్ణిగా నటించడానికి ఎలా సన్నద్ధమయ్యారు?
నాన్నగారు ఓ ఎన్‌సైక్లోపీడియా. కృష్ణుడు, రాముడు తదితర పాత్రలతో కట్టుబొట్టు దగ్గర నుంచి ఆభరణాల వరకూ ఎలా ఉండాలనేది చెప్పారు. అవన్నీ మా స్టూడి యోలో ఉన్నాయి. త్వరలో మ్యూజియం ఏర్పాటుకి సన్నా హాలు చేస్తున్నాం. నేను చేసిన పౌరాణిక పాత్రలకు హెల్ప్ అయ్యాయి. కానీ, శాతకర్ణి పాత్రకి రిఫరెన్స్‌లు లేవు. దాంతో ఈ పాత్ర నాకో పెద్ద పరీక్ష పెట్టింది. నిజానికి, శాతవాహనులు గిరిజ నులు. వస్త్రధారణ, ఆచారవ్యవ హారాలు వేరు. క్రిష్ సలహాతో, ఆయన చెప్పింది చేశా!
► క్రిష్ దర్శకత్వం గురించి?
క్రిష్ ఆరో చిత్రమిది. అతడి గత చిత్రాలు చూస్తే... ఓ చిత్రానికీ, మరో చిత్రానికీ సంబంధం లేదు. కొందరు దర్శకుల దగ్గర జబ్బు ఏంటంటే.. ‘ఒకే రకమైన సిన్మాలు తీస్తూ, మీ కోసమే ఈ కథ తయారు చేశాం’ అంటారు. ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో! అలాంటి కథ తీసుకురమ్మని అడుగుతా. సరిగ్గా క్రిష్ నేను కోరు కున్న కథ తెచ్చాడు. నాతో పాటు ప్రతి ఒక్కరి పాత్రనూ అద్భుతంగా తీర్చిదిద్దాడు. 2.15 గంటల్లో తీశాడు. హ్యాట్సాఫ్ టు క్రిష్.
► ఎన్టీఆర్‌తో చేసిన హేమమాలిని, ఇప్పుడు మీతో నటించడం...?
హేమమాలిని లేకపోతే సినిమా లేదండీ. నాన్న గారితో ‘పాండవ వనవాసం’లో చేశారు. తర్వాత ‘శ్రీకృష్ణ పాండవీయం’లో రుక్మిణి పాత్రకు తీసుకోవాలనుకున్నారు. హిందీలో ఐదు సినిమాలు అంగీకరించడంతో ఆమెకు కుదరలేదు. ఇప్పుడీ సినిమాలో పాత్ర ఏంటి? అనేది చూశారామె. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తల్లి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు.
►కన్నడ శివరాజ్‌కుమార్‌ను తీసుకోవాలనే ఆలోచన మీరే ఇచ్చారట కదా!
రాజ్‌కుమార్ ఫ్యామిలీ ఇతర భాషల్లో నటిస్తే అభిమానులు ఒప్పుకోరు. ఇప్పటివరకూ చేయలేదు కూడా! కానీ, శాతకర్ణి కీర్తిని వివరించే పాట ఆయన చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను ఫోన్ చేసి అడగ్గానే, సాయంత్రానికి ఒప్పుకున్నారు.
► ఫస్ట్ కాపీ చూశాక మీ ఫీలింగ్ ఏంటి?
ఈ కథకి ఓకే చెప్పినప్పటి నుంచీ అనిర్వచనీయ అనుభూతి. ఈ కథకీ, నాకూ సంధానకర్తగా క్రిష్‌ని అదృశ్య శక్తులు పంపాయని నమ్ముతున్నా. ఎప్పుడూ ఇలాంటివి నమ్మని క్రిష్ ఓ సందర్భంలో ‘79 రోజుల్లో చిత్రీకరణ పూర్తవడం వెనుక ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.
► భారీ చిత్రాన్ని నిర్మాతలెలా చేశారు?
సినిమా అంటే కేవలం వినోదం కాదు. భావితరాలకు మన గొప్ప సంస్కృతిని అందిస్తూ, కాపాడు కోవాలి. మా నిర్మాత లకు అంత మంచి ఆలోచన ఉంది కాబట్టే అకుంఠిత దీక్షతో ఇంత మంచి సినిమా,ఎక్కడా రాజీ పడకుండా తీశారు.
► సంక్రాంతికి రెండు పెద్ద చిత్రాలు రిలీజ్. చిరంజీవితో మీ పోటీ అనుకోవచ్చా?
‘పోటీ ఎవరూ లేరు, సక్సెస్ వచ్చే సింది’ అనేది ఆశాజనకంగా ఉండదు. అయినా మా మధ్య ఉన్నది ఆరోగ్య కరమైన పోటీ. పండగకి మంచి చిత్రాలు రావడం సంతోషం. రెండూ హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. చిరంజీవికి నా శుభాకాంక్షలు.
► 101వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ చేయనున్నారా?
‘రైతు’లో కీలక పాత్రలో నటించాల్సిందిగా అమితాబ్ బచ్చన్‌గారిని కలిశాం. కృష్ణవంశీతో కలసి ఆయనకు కథ వినిపించా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అమితాబ్ స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటా.
► వందో చిత్రం.. విడుదలకు ముందు నెర్వస్‌గా ఏమైనా ఉందా?
ఎలా కనపడుతున్నా! నాట్ ఎట్ ఆల్ నెర్వస్. నా అభిమానులు, ప్రేక్షకదేవుళ్లు కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారీ ఆదరించారు. వాళ్ల అభిమానమే నాకు శ్రీరామరక్ష. నాకు ఏ భయం లేదు. ఇప్పుడు జనరేషన్ మారుతోంది. ఇకపై చేసే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటా! ప్రేక్షకులు కొత్త బాలకృష్ణని చూస్తారు.
నాన్నగారు ఏ పాత్ర చేసినా పాత్రలో లీనమై చేసేవారు. నేను శాతకర్ణిగా ఎలా చేశాననేది రేపు చూస్తారు. నటన అంటే కేవలం నవ్వడం, ఏడవడం, హావభావాలు పలికించడం కాదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించాలి. కబీర్‌బేడీ ఫస్ట్‌డే షూటింగ్‌కి వచ్చినప్పుడు నాకూ, ఆయనకీ మధ్య ‘బడుగు జాతి కాదురా.. తెలుగుజాతి. మేము అధములం కాదురా.. ప్రథములం’ అనే సీన్ ప్లాన్ చేశారు. నేను డైలాగ్ చెప్ప గానే కబీర్‌బేడి ‘సారీ అండీ. నేను పాత్రలోకి వెళ్లడానికి టైమ్ కావాలి. మన్నించండి’ అని చెప్పి హోటల్‌కి వెళ్లారు. ఆయనకు రాత్రంతా నిద్రపట్టలేదట! డైలాగులు, హావభావాలు ప్రాక్టీస్ చేశానన్నారు. ఎంత పెద్ద నటుడికైనా అలాంటి తపన ఉండాలి.
కథ చెప్పగానే నేను చేయగలనా? లేదా? అని కంగారుపడ్డా. ప్రతి అంశంలో క్రిష్ రీసెర్చ్ చేయడంతో ఆయనను ఫాలో అయ్యా. బాలకృష్ణగారితో నటించి పదేళ్లు దాటింది. అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో ఏ మార్పూ లేదు. సెట్‌లో నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారు.’’ – శ్రియ