
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై నిప్పు రాజుకుంటోంది. అవార్డుల ఎంపికలో పారదర్శకత లేదని సోషల్ మీడియా నెట్‌జన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం బన్నీవాసు అవార్డుల జాబితాను విమర్శించగా, తాజాగా మరో మెగా అభిమాని బండ్ల గణేష్ సైతం అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు పారదర్శకంగా లేవని తీవ్ర ఆరోపణలు చేశారు.
సగటు సినీ అభిమానులు ఈ అవార్డుల గురించే మాట్లాడుకుంటున్నారని, అవార్డుల జాబితాలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇచ్చినవి నంది అవార్డులు కాదని, సైకిల్ అవార్డులంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, జ్యూరీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఉత్తమ నటుడి అవార్డు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కంటితుడుపు చర్యగా చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారని ఆరోపించారు. మగధీర సమయంలోనూ ఇలానే చేశారని గణేష్ ఆరోపించారు.
2016 అవార్డుల కమిటీలో అల్లు అరవింద్ జ్యూరీ సభ్యుడిగా ఉన్నా మెగా హీరోలకు అవార్డులు ఇవ్వాలని ఏనాడు అడగలేదని అన్నారు. తను టీడీపీ వ్యతిరేకిని కాదని, తనకు ఏపార్టీతో సంబంధం లేదని తనకు అన్యాయం అనిపిస్తే వెంటనే ప్రశ్నిస్తాన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయనిపిస్తే వెనక్కి తీసుకుంటానని అన్నారు.