సినిమా రివ్యూ: బంగారు కోడిపెట్ట
సినిమా రివ్యూ: బంగారు కోడిపెట్ట
Published Fri, Mar 7 2014 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నవదీప్, స్వాతి నటించిన 'బంగారు కోడిపెట్ట' శుక్రవారం విడుదలైంది. 'బోణి' చిత్రంతో పరిచయమైన రాజ్ పిప్పళ్ల దీనికి దర్శకుడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఎనర్జీ డ్రింక్ కంపెనీలో వంశీ (నవదీప్) భాను (స్వాతి) పనిచేస్తుంటారు. ప్రమోషన్ వస్తుందని ఆశతో ఉన్న భాను బాస్ ప్రవర్తన కారణంగా ఉద్యోగం కోల్పోతుంది. అనుకోకుండా భానుకు డబ్బు అవసరమవుతుంది. డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎనర్జీ డ్రింక్ కంపెనీ వినియోగదారులకు అందించేందుకు పంపే బంగారు బిస్కట్, కాయిన్స్ ను కాజేయాలని ప్లాన్ వేస్తుంది. గోల్డ్ బిస్కట్, కాయిన్స్ ను కాజేసేందుకు వంశీని భాగస్వామిగా పెట్టుకుంటుంది. భానుకి డబ్బు ఎందుకు అవసరమైంది? దొంగతనం చేసే క్రమంలో వంశీకి ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు గోల్డ్ బిస్కట్, కాయిన్స్ ను భాను, వంశీలు విజయవంతంగా దోచుకున్నారా? అనే ప్రశ్నలకు జవాబు 'బంగారు కోడిపెట్ట'. అయితే ఈ కథకు 'బంగారు కోడిపెట్ట' టైటిల్ సంబంధమేమిటని ఆలోచిస్తే.. ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే తెరపైన సమాధానం దొరుకుతుంది.
నవదీప్ నటించిన వంశీ పాత్రలో కొత్తదనమే కనిపించదు. ప్రేక్షకులను ఆకట్టుకునే రేంజ్ లో క్యారెక్టర్ ను డిజైన్ చేయకపోవడంతో నవదీప్ చేయాల్సిందేమీ లేకపోయింది. ఇక భాను పాత్రలో అల్లరి, కొంటె పిల్లగా కనిపించినా.. స్వాతి మెప్పించలేకపోయింది. కథలో ఉండే పరిమితుల వల్ల భాను, వంశీ పాత్రలు గొప్పగా ఎస్టాబ్లిష్ కాలేకపోయాయి. కథలో భాగంగా వచ్చే దొరబాబు, ఎర్రబాబు (స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్) పాత్రలు కొంత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తాయి. కానీ కథలో పసలేకపోవడంతో వీరిద్దరి ఫెర్మార్మెన్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎనర్జీ డ్రింక్ కంపెనీ మేనేజర్ గా విలన్ షేడ్ ఉన్న పాత్రలో రచయిత హర్షవర్ధన్ కనిపించారు. హర్షవర్దన్ నటన కూడా అంతంతమాత్రంగానే ఉంది.
కథలో కొత్తదనం లేకుండా 'బంగారు కోడిపెట్ట'ను పట్టుకుని దర్శకుడు రాజ్ పిప్పళ్ల మరోసారి సాహసమే చేశాడని చెప్పవచ్చు. బోణీతో ఆకట్టుకోలేకపోయిన రాజ్ పిప్పళ్ల.. కథ, కథనాన్ని గాలికి వదిలేసి మరోసారి నిరాశపరిచారనే చెప్పవచ్చు. రొటీన్ కు భిన్నంగా చిత్రాన్ని రూపొందించినట్టు చిత్ర సన్నివేశాల్ని ఆరంభించినా.. కాసేపటికే విషయం లేదని సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. పూర్తి చిత్రంలో రామ్, లక్ష్మణ్ ఎపిసోడ్ లో పాప సీన్లు, సినీ నటుడు కావాలని ప్రయత్నించే పిజా బాయ్ (సంతోష్) పాత్రలు కొంత పర్వాలేదనిపిస్తోంది. కథ, కథనాలపై మరికొంత శ్రద్ధ వహించి ఉంటే ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకునేది.
ఇక ఈ చిత్రంలో సాహిర్ రజా ఫోటోగ్రఫి, మహేశ్ శంకర్ సంగీతం పర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. కథనం పేలవంగా ఉన్న కారణంగా ఎడిటింగ్ కు చంద్రశేఖర్ మరింత పదను పెడితే కొంత ఆసక్తి కలిగించేదేమో. టాలీవుడ్ లో సరైన హిట్ కోసం నవదీప్, స్వాతి, దర్శకుడు రాజ్ పిప్పళ్లకు ఈ కోడిపెట్ట బంగారు గుడ్డు అందించడం కష్టమే.
-రాజబాబు అనుముల
Advertisement
Advertisement