Bangaru Kodipetta
-
బంగారు కోడిపెట్ట టీమ్‌తో చిట్‌ఛాట్
-
ఓ కొత్త ప్రయత్నం ఇది!
‘‘తెలుగులో వచ్చిన ఓ కొత్త ప్రయత్నం ‘బంగారు కోడిపెట్ట’. ఈ సినిమాను ఆదరిస్తే... ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి అన్నారు. నవదీప్, స్వాతి జంటగా రాజ్ పిప్పళ్ల దర్శకత్వంలో సునీత తాటి నిర్మించిన చిత్రం ‘బంగారు కోడిపెట్ట’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ -‘‘నవదీప్ నటన బావుందని అందరూ అంటున్నారు. తన కెరీర్‌కి మంచి మలుపు ఈ సినిమా. ఇటీవలే థియేటర్లో సినిమా చూశాను. చాలా మంచి స్పందన వస్తోంది’’ అని చెప్పారు. ‘‘ ‘బంగారు కోడిపెట్ట’కు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. తన రెండో సినిమాతోనే విచిత్రమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేశాడు దర్శకుడు రాజ్ పిప్పళ్ల. ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు అందుతున్నాయి’’ అని నవదీప్ చెప్పారు. 42 రోజుల్లో సినిమా పూర్తి చేశామని, భిన్నంగా ఉందని అందరూ అభినందిస్తున్నారని నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. వాణిజ్య విలువలు, కొత్తదనం రెండూ కలిస్తే తమ ‘బంగారు కోడిపెట్ట’ ’’ అని దర్శకుడు పేర్కొన్నారు. -
సినిమా రివ్యూ: బంగారు కోడిపెట్ట
టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నవదీప్, స్వాతి నటించిన 'బంగారు కోడిపెట్ట' శుక్రవారం విడుదలైంది. 'బోణి' చిత్రంతో పరిచయమైన రాజ్ పిప్పళ్ల దీనికి దర్శకుడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఎనర్జీ డ్రింక్ కంపెనీలో వంశీ (నవదీప్) భాను (స్వాతి) పనిచేస్తుంటారు. ప్రమోషన్ వస్తుందని ఆశతో ఉన్న భాను బాస్ ప్రవర్తన కారణంగా ఉద్యోగం కోల్పోతుంది. అనుకోకుండా భానుకు డబ్బు అవసరమవుతుంది. డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎనర్జీ డ్రింక్ కంపెనీ వినియోగదారులకు అందించేందుకు పంపే బంగారు బిస్కట్, కాయిన్స్ ను కాజేయాలని ప్లాన్ వేస్తుంది. గోల్డ్ బిస్కట్, కాయిన్స్ ను కాజేసేందుకు వంశీని భాగస్వామిగా పెట్టుకుంటుంది. భానుకి డబ్బు ఎందుకు అవసరమైంది? దొంగతనం చేసే క్రమంలో వంశీకి ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు గోల్డ్ బిస్కట్, కాయిన్స్ ను భాను, వంశీలు విజయవంతంగా దోచుకున్నారా? అనే ప్రశ్నలకు జవాబు 'బంగారు కోడిపెట్ట'. అయితే ఈ కథకు 'బంగారు కోడిపెట్ట' టైటిల్ సంబంధమేమిటని ఆలోచిస్తే.. ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే తెరపైన సమాధానం దొరుకుతుంది. నవదీప్ నటించిన వంశీ పాత్రలో కొత్తదనమే కనిపించదు. ప్రేక్షకులను ఆకట్టుకునే రేంజ్ లో క్యారెక్టర్ ను డిజైన్ చేయకపోవడంతో నవదీప్ చేయాల్సిందేమీ లేకపోయింది. ఇక భాను పాత్రలో అల్లరి, కొంటె పిల్లగా కనిపించినా.. స్వాతి మెప్పించలేకపోయింది. కథలో ఉండే పరిమితుల వల్ల భాను, వంశీ పాత్రలు గొప్పగా ఎస్టాబ్లిష్ కాలేకపోయాయి. కథలో భాగంగా వచ్చే దొరబాబు, ఎర్రబాబు (స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్) పాత్రలు కొంత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తాయి. కానీ కథలో పసలేకపోవడంతో వీరిద్దరి ఫెర్మార్మెన్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎనర్జీ డ్రింక్ కంపెనీ మేనేజర్ గా విలన్ షేడ్ ఉన్న పాత్రలో రచయిత హర్షవర్ధన్ కనిపించారు. హర్షవర్దన్ నటన కూడా అంతంతమాత్రంగానే ఉంది. కథలో కొత్తదనం లేకుండా 'బంగారు కోడిపెట్ట'ను పట్టుకుని దర్శకుడు రాజ్ పిప్పళ్ల మరోసారి సాహసమే చేశాడని చెప్పవచ్చు. బోణీతో ఆకట్టుకోలేకపోయిన రాజ్ పిప్పళ్ల.. కథ, కథనాన్ని గాలికి వదిలేసి మరోసారి నిరాశపరిచారనే చెప్పవచ్చు. రొటీన్ కు భిన్నంగా చిత్రాన్ని రూపొందించినట్టు చిత్ర సన్నివేశాల్ని ఆరంభించినా.. కాసేపటికే విషయం లేదని సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. పూర్తి చిత్రంలో రామ్, లక్ష్మణ్ ఎపిసోడ్ లో పాప సీన్లు, సినీ నటుడు కావాలని ప్రయత్నించే పిజా బాయ్ (సంతోష్) పాత్రలు కొంత పర్వాలేదనిపిస్తోంది. కథ, కథనాలపై మరికొంత శ్రద్ధ వహించి ఉంటే ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకునేది. ఇక ఈ చిత్రంలో సాహిర్ రజా ఫోటోగ్రఫి, మహేశ్ శంకర్ సంగీతం పర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. కథనం పేలవంగా ఉన్న కారణంగా ఎడిటింగ్ కు చంద్రశేఖర్ మరింత పదను పెడితే కొంత ఆసక్తి కలిగించేదేమో. టాలీవుడ్ లో సరైన హిట్ కోసం నవదీప్, స్వాతి, దర్శకుడు రాజ్ పిప్పళ్లకు ఈ కోడిపెట్ట బంగారు గుడ్డు అందించడం కష్టమే. -రాజబాబు అనుముల -
అప్పుడు తప్పకుండా ఆ శుభవార్త చెబుతా!
స్వాతిలో తెలీని మెస్మరైజింగ్ పవర్ ఉంది. కాసేపు మాట్లాడితే చాలు అయస్కాంతంలా ఆకర్షించేస్తుంది తను. ఆ క్వాలిటీనే... ఆమెను దక్షిణాదిన బిజీ తారని చేసింది. ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమాలతో స్వాతి బిజీ బిజీ. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అదే ‘బంగారు కోడిపెట్ట’. నవదీప్ ఇందులో హీరో. రాజ్ పిప్పళ్ల దర్శకుడు. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది. అందుకే... శుక్రవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించింది స్వాతి. అప్పుడే ఏడాది కావొస్తుందా!: తెలుగులో నా సినిమా వచ్చి ఏడాది కావస్తుందంటే... నమ్మబుద్ధి కావడం లేదు. తమిళం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది. ‘బంగారు కోడిపెట్ట’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. పేరు భానుమతి పినిశెట్టి. చదివింది 8వ తరగతి. అమ్మానాన్న లేరు. అక్కాబావా దగ్గర ఉండటం ఇష్టం లేదు. అందుకే వారి నుంచి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నాలు. ఎవరితోనైనా సరే.. కంటిచూపుతోనే పనులు చేయించేసుకుంటా. ఇలా సాగుతుంది నా పాత్ర. ‘స్వామి రారా’లోని నా పాత్రతో పోలిస్తే ఎట్నుంచి చూసినా కొత్తగా ఉంటుందీ పాత్ర. తనకు మంచి బ్రేక్ రావాలి: కథే ఈ చిత్రానికి ప్రాణం. కొంత విలేజ్‌లో కొంత సిటీలో ఈ కథ సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాజ్ పిప్పళ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ రాబరీ నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే ‘స్వామి రారా’కు పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకుడు కథను చెప్పిన తీరు సూపర్బ్. ప్రతి సన్నివేశం సంతృప్తికరంగా రావడానికి తను పడిన కృషి నిజంగా అభినందించదగిందే. ఇక నవదీప్ గురించి చెప్పాల్సి వస్తే... తనతో సినిమా చేస్తున్నాను అనగానే... చాలామంది రకరకాలుగా మాట్లాడారు. కానీ.. తనతో చేశాక అవన్నీ కరెక్ట్ కాదనిపించింది. నవదీప్ మంచి నటుడు. మంచి బ్రేక్ వస్తే తనేంటో నిరూపించుకోగలడు. ఈ సినిమాతో అది జరుగుతుంది. నిజంగా వారికి హేట్సాఫ్: గ్లామర్ పాత్రలకు నేను దూరం కాదు. అయితే.. దర్శక, నిర్మాతలు నన్ను ఆ కోణంలో చూడటం లేదు. ఆ విధంగా చూసుకుంటే నేను నిజంగా లక్కీనే. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయగలుగుతున్నాను. హీరోహీరోయిన్లు తొలిసారి కలిసినప్పుడు... మన సినిమాల్లో కొన్ని సింబాలిక్ షాట్స్ వేస్తారు. కానీ నిజజీవితంలో అలాంటివి జరగవు. నా సినిమాల్లో కూడా అలాంటివి ఉండవ్. సాధ్యమైనంతవరకూ నిజానికి దగ్గరగానే నా సినిమాలుంటాయి. గ్లామర్ పాత్రలతో పోలిస్తే... ఇలాంటి పాత్రలు చేయడమే నాకు తేలిక. గ్లామర్ ఇమేజ్ కోసం వారు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. డ్రెస్ దగ్గర్నుంచి నెయిల్ పాలిష్ వరకూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒళ్లు అలిసిపోయేలా డాన్సులు చేయాలి. అన్ని కష్టాలు భరిస్తే కానీ వారికి ఆ ఇమేజ్ రాదు. నిజంగా వారిని అభినందించాల్సిందే. అది సరైనది కాదు: నేను తెలుగమ్మాయిని అవడం వల్లే ఇక్కడ నన్ను ప్రోత్సహించడంలేదు అనడం సరికాదు. సినిమా అనేది బిజినెస్‌తో ముడిపడిన విషయం. ఇక్కడ క్రేజ్ ముఖ్యం. ఒక ముంబయ్ హీరోయిన్ తమ సినిమాలో కథానాయిక అంటే... అదో క్రేజ్ కదా. అందుకే... అది తప్పు అని నేను అనను. నేను నచ్చినవారి వద్ద నాకు నచ్చిన కథల్ని ఎంచుకుని ముందుకెళుతున్నాను. ఇదే నాకు కంఫర్ట్‌గా ఉంది. గ్లామర్ అంటే ఆమే: గ్లామర్ అంటే ఏంటి? అని ఎవరైనా అడిగితే... నేను సింపుల్‌గా చెప్పే సమాధానం శ్రీదేవి. ఆమె అందంగా కనిపిస్తుంది. అద్భుతంగా నటిస్తుంది. అందుకే అందానికి పర్యాయపదం ఆమె. నాకంటూ డ్రీమ్ రోల్స్ ఏమీ లేవు. మంచి పాత్రలు చేసుకుంటూ పోవడమే నా ముందున్న లక్ష్యం. ఇక రూమర్లు అంటారా! వాటిని అస్సలు పట్టించుకోను. పాజిటివ్ థింకింగ్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే భవిష్యత్తులో మనకు అంతా మంచే జరుగుతుంది. పెళ్లి గురించి కూడా చాలామంది అడుగుతుంటారు. ఒకరినొకరు భరించుకోవడమే దాంపత్యం అని నా ఉద్దేశం. అలా నన్ను భరించేవాడు, నేను భరించగలిగేవాడు దొరికినప్పుడు తప్పకుండా శుభవార్త చెబుతా.