బోయపాటిలో రెండోవైపు చూడండి!
‘చూడు... ఒకవైపే చూడు. రెండోవైపు చూడాలనుకోకు... మాడి మసైపోతావ్!’ – దర్శకుడు బోయపాటి సిన్మాలంటే ఇలాంటి పంచ్ డైలాగులు, మాస్ హీరోయిజమ్ గుర్తుకొస్తాయి. కానీ, ఫస్ట్ టైమ్ ఆయన తన సిన్మాలో హీరోని సాఫ్ట్‌గా చూపిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘జయ జానకి నాయక’. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు.
రోడ్డు పక్కన పార్క్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్... దాన్ని అనుకుని హీరోయిన్ రకుల్... రోడ్డుపై కూర్చున్న హీరో... బోయపాటి దర్శకత్వంలో రెండోవైపును చూడండి! ఆయన అభిమానులకు ఈ లుక్ కాస్త సర్‌ప్రైజ్ ఇస్తే, ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకుంది. ఈ సిన్మాలో బోయపాటి మార్క్ యాక్షన్ కూడా ఉందట! ప్రస్తుతానికి దాన్ని దాచేశారు. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రగ్యా జైశ్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.