ఆ ఇద్దరి మధ్య వివాదం
కోలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగుతోంది. అయితే తాజాగా దానికి భంగం కలుగుతోందనిపిస్తోంది. కారణం ఒక నవల కావడం గమనార్హం. కుట్రపరంపరై అనే నవలను తెరకెక్కించే విషయంలో ఇద్దరు ప్రముఖుల మధ్య వివాదం ఏర్పడింది. ఆ నవలను తెరకెక్కించే హక్కులు తనవంటే తనవని ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా, సంచన దర్శకుడు బాలా పోటీ పడుతుండడం వివాదానికి దారి తీసింది. వాస్తవానికి కుట్రపరంపరై నవలను చిత్రంగా తెరపై ఆవిష్కరించాలన్న ప్రయత్నాన్ని దర్శకుడు భారతీరాజా చాలా కాలం ముందే చేశారు.
కొన్ని అనివార్యకారణాల వల్ల అది జరగలేదు. తాజాగా దాన్ని దర్శకుడు బాలా హ్యాండిల్ చేయాలని సంకల్పించారు. ఇదే వారిద్దరి మధ్య వివాదానికి, కోలీవుడ్‌లో కలకలానికి తెర లేపింది. కాస్త విపులంగా చెప్పాలంటే బ్రిటీష్ పాలనకు ముందు ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు దొంగతనాన్నే వృత్తిగా జీవించడంతో వారిని కుట్రపరంపరై(పారంపర్య నేరస్తులు)ఆ తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ముద్రవేసింది.ఈ ఇతి వృత్తంతో వేలా రామమూర్తి రాసిన నవలను దర్శకుడు భారతీరాజా చిత్రంగా మలచనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. దాన్ని దివంగత ప్రఖ్యాత నటుడు శివాజీగణేశన్, శరత్‌కుమార్‌లతో తెరకెక్కించడానికి ప్రయత్నించారట.
ఆ సమయంలో శివాజీగణేశన్ అనారోగ్యానికి గురవడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదని రచయిత రత్నకుమార్ అంటున్నారు. తారైతప్పట్టై చిత్రం పూర్తి చేసిన దర్శకుడు బాలా తదుపరి కుట్రపరంపరై నవలను చిత్రంగా రూపొందించనున్నట్లు, ఇందులో విశాల్, ఆర్య, రానా, అరవిందసామి,అనుష్క నటించనున్నట్లు వెల్లడించారు.దీంతో భారతీరాజా, బాలాల మధ్య వివాదానికి తెరలేచింది.రచయిత వేలా రామమూర్తి దర్శకుడు బాలానే కుట్రపరంపరై నవలకు తెరపై ప్రాణం పోయగలరనీ,త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానుందని అంటున్నారు.
అయితే భారతీరాజాతో కథా చర్చల్లో పాల్గొన్న రచయిత రత్నకుమార్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కుసీమయిలే,కరుత్తమ్మ,కాదల్‌పూక్కల్ చిత్రాలకు మాటలు రాసిన ఈయన తెలుపుతూ కుట్రపరంపరై నవలకు భారతీరాజా తెర రూపం ఇవ్వడానికి గత 30 ఏళ్లుగా చర్చలు జరుపుతున్నామని అన్నారు. 1977లోనే ఈ కథను రచయితల సంఘంలో రిజిస్టర్ చేశామని తెలిపారు.అప్పట్లోనే శివాజీగణేశన్,శరత్‌కుమార్‌లను నటింపచేయడానికి చర్చలు జరిపినట్లు వెల్లడించారు.అయితే శివాజీగణేశన్ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ ప్రారంభం కాలేదన్నారు.
కాగా కుట్ర పరంపరై కథా చర్చల్లో రచయిత వేలా రామమూర్తి కూడా పాల్గోన్నారని చెప్పారు.దర్శకుడు భారతీరాజానే ఈ నవలను సమర్ధవంతంగా తెరకెక్కించగలరనే అభిప్రాయాన్ని రత్నకుమార్ వ్యక్తం చేశారు.కాగా ఈ వివాదాన్ని పరిష్కరించే విధంగా దర్శకుడు బాలాతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు.కుట్రపరంపరై చిత్రాన్ని బాలా కనుక దర్శకత్వం వహించదలిస్తే తాము చట్ట ప్రకారం కేసు వేస్తామని రత్నకుమార్ అంటున్నారు.దీంతో కుట్రపరంపరై విషయంలో దర్శకులు భారతీరాజా,బాలాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.