ఒకే రోజు తెరపైకి విజయ్, అజిత్ చిత్రాలు
తాజా పరిణామాలతో సంక్రాంతి చిత్రాల విడుదలలో ఆసక్తి నెలకొంది. అజిత్, విజయ్ చిత్రాలు ఒకే రోజున బరిలోకి దిగనుండటంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం జిల్లా. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్న చిత్రం ఇది. నవ దర్శకుడు నేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇళయదళపతి సరసన అందాల తార కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీత బాణి లందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తుపాకీ చిత్రం విజయంతో రైజింగ్‌లో ఉన్న విజయ్ తదుపరి చిత్రం తలైవా నిరాశపరచింది. దీంతో జిల్లాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా విజయ్ సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్ హిట్ కాంబినేషన్. దాన్ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే జిల్లా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతుందనే ప్రచారం జరిగింది. కాదు జనవరి 10నే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత ఆర్‌బి చౌదరి వెల్లడించారు. ఈ చిత్రాన్ని విదేశాలలోనే 400 థియేటర్లలో రిలీజ్ చేయనున్నామని తెలిపారు.
అజిత్ చిత్రం వీరం జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. ప్రఖ్యా త నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్ పతాకంపై నిర్మాతలు వెంకట్రామిరెడ్డి, బి.భారతి రెడ్డి నిర్మిస్తున్న భారీ బడ్జెట్, భారీ తారాగణ చిత్రం వీరం. అజిత్ సరసన నటి తమన్నా తొలిసారిగా జతకడుతున్న ఈ చిత్రానికి చిరుతై ఫేమ్ శివ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. పల్లెటూరి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ వైవిధ్యభరిత కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్రమాలను, అన్యాయాలను ఎదిరించే ధీరోదాత్త పాత్రలో అజిత్ నటించారు. ఈ చిత్రంపై అటు చిత్ర పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఆడియోలోనూ పోటీనే
విశేషం ఏమిటంటే జిల్లా, వీరం చిత్రాలు జనవరి పదిన విడుదలకు సిద్ధం అవుతుండగా చిత్ర ఆడియో విడుదలలోనూ పోటీపడుతున్నాయి. అజిత్ వీరం చిత్ర ఆడియో శుక్రవారం విడుదల కాగా విజయ్ జిల్లా చిత్ర ఆడియో శనివారం విడుదలకు రానుంది. అలాంటి ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని చేకూర్చుతారో వేచి చూడాల్సిందే.