బిగ్‌బాస్ హోస్ట్ నాని (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2 ఏమైనా జరగొచ్చు.. అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీషో అలానే ప్రేక్షకులకు కావల్సిన అసలు సిసలు మజాను అందిస్తోంది. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్‌గా నాని ఆకట్టుకున్నాడు. గత రెండు వారాల్లో కనిపించిన నాని కన్నా ఈ ఎపిసోడ్‌లో భిన్నంగా కనిపించాడు. వస్తూ వస్తూనే అనగనగా.. ఓ రాజు.. ఏడుగురు పిల్లలు.. అంటూ ఓ పిట్టకథ చెప్పి హోస్ట్‌గా తనలోని వైవిధ్యాన్ని చూపించాడు. ఇక శుక్రవారం హౌస్‌లో చోటుచేసుకున్న వ్యవహారాలపైనే ఈ ఎపిసోడ్ అంతా చర్చ జరిగింది. ముఖ్యంగా కిరిటీ దామరాజు, కౌశల్ పట్ల వ్యవహరించిన తీరును నాని తప్పుబట్టాడు.
కెప్టెన్ టాస్క్‌లో భాగంగా చేతులు కట్టేసిన కౌశల్ ముందు నిమ్మరసంతో బాధపట్టే ప్రయత్నం.. మాటలతో రెచ్చగొట్టడం.. అమ్మాయిల తరఫున మాట్లాడుతూ.. తన ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయడం.. మగతనమా అని ఘాటుగా ప్రశ్నించాడు. కిరీటి దామరాజు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాడని, తోటి కంటెస్టెంట్‌లను సైతం హెచ్చరించాడు. దానికి సంబంధించిన వీడియోలను చూపించాడు. అంతేకాకుండా కిరిటీ ఎలిమినేషన్ ప్రకియలో ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా తిరస్కరించేవారని, అంతలా ప్రేక్షకులు వ్యతిరేకిస్తున్నారని కూడా హెచ్చరించాడు. దీనికి కిరీటి ఆ వ్యతిరేకతను తొలిగించుకుంటానని నానికి మాటిచ్చాడు.
అంతా కపట ప్రేమ..
ఇక తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారని కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తొలి రోజు నుంచి కొందరు ఓ గ్రూప్‌గా ఏర్పడి ఇతరులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. ఓ టాస్క్‌లో భాగంగా చేసిన పనిని పదేపదే ఎత్తి చూపుతున్నారని, కెప్టెన్ టాస్క్‌లో భాగంగా.. హౌస్‌మెట్స్ కనీస మానవత విలువలు పాటించేలేదన్నాడు. ఒకరేమో నిమ్మరసం, మరొకరేమో పసుపుతో, ఇంకొకరేమో.. అమ్మాయిలను ఇబ్బంది పెట్టినట్లు మాట్లాడారని, ఆ సమయంలో తన పిల్లలు ‘నాన్నకు ఏమైంది అమ్మా అని ప్రశ్నిస్తే నా భార్య ఏమని’ సమాధానం చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ప్రతి ఒకరు జైలు కార్డ్ విషయంలో తనని తప్పుబడుతున్నారని, ఎవరూ నిజాయితీగా కనిపించకపోవడంతోనే జైలు కార్డు ఇవ్వలేదని, ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం తనదని తెలిపాడు. ఇక్కడంతా కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి నాని బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరుగవచ్చు అనడానికి ఇదే నిదర్శనం అని తెలిపాడు.
కౌశల్ Vs తనీష్..
ఇక ఈ ఎపిసోడ్‌లో కౌశల్, తనీష్‌ల మధ్య ఉన్న మనస్పర్ధలు మరొకసారి బయటపడ్డాయి. శుక్రవారం ఎపిసోడ్‌లోనే కొట్టుకున్నంత పనిచేసిన వీరిద్దరు ఆ ఆగ్రహాన్ని ఈ ఎపిసోడ్‌లో సైతం కొనసాగించారు. ఈ ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన ఎమోజీల కాన్సెప్ట్‌తో వీరి మధ్య కోపాలు చల్లారలేదని తేటతెల్లమైంది. తొలుత తనీష్‌కు ఇరిటేటింగ్ ఎమోజీ రాగా.. దాన్ని అతను కౌశల్ మెడలో వేసి హౌస్‌లో తనకు చికాకు తెప్పించేది అతనే అని తెలిపాడు. దీనికి జైలు కార్డు దీప్తికి ఇవ్వకపోవడమేనని వివరణ ఇచ్చాడు. ఇక కౌశల్‌కు సైతం తన ఎమోషన్‌కు తగ్గట్టే పంచ్ ఎమోజీ వచ్చింది. దీన్ని వెంటనే కౌశల్, తనీష్ మెడలో వేసాడు. హౌస్‌లో కొట్టే అవకాశం వస్తే తనీష్‌నే కొడతానన్నట్లు ఆ ఎమోజీ అతని మెడలో వేసాడు.
బాబు గోగినేనికి ప్రశంసలు
హౌస్‌లో బిగ్‌బాస్‌పై ఫైర్ అయిన బాబు గోగినేనిని నాని ప్రశంసించాడు. కంటెస్టెంట్‌లకు గాయాలైనా బిగ్‌బాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అలా చేశానని, ఒకరికి బానిసను కాదు అనే మనస్థత్వం తనదని బాబుగోగినేని వివరణ ఇచ్చాడు. దీనికి నాని స్పందిస్తూ తమ టీమ్ ఎలాంటి తప్పిదాలు జరగకుండా 100 శాతం ప్రయత్నిస్తోందని, అప్పుడప్పుడు చిన్నతప్పిదాలు జరుగుతాయని, ఇక నుంచి అలాంటివి జరగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చాడు. గాయాలైతేనే స్పందించే మీరు ఇంత గొడవలు జరుగుతున్నా.. ఎందుకు స్పందించలేదని ఆయనను నాని ప్రశ్నించాడు. ఆవేశంలో ఉన్నవారి మధ్య తానేప్పుడు తలదూర్చనని, టీవీ, కెమెరాల కోసం అలాంటి పనులు చేయనన్నాడు.
దీప్తి సునైనా చిన్న పిల్ల కాదు..
గత వారం దీప్తి సునైనా పై ట్రోల్స్ రావడాన్ని తప్పుబడుతూ.. 20 ఏళ్లకే ఆమె ఎంతో పేరు తెచ్చుకుందని, నాని ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే అలా ఆమెపై పొగడ్తలు కురిపించడం తాను చేసిన పెద్ద తప్పన్నట్లు నాని తన పిట్టకథతో పరోక్షంగా తెలియజేశాడు. ఆమె కంటెస్టెంట్‌లతో వ్యవహరించిన వీడియోలు చూపిస్తూ.. చిన్నపిల్ల అనుకుంటున్నారు.. కాదు జాగ్రత్త అని హెచ్చరించాడు. అందరూ దీప్తి సునైనాను కంటెస్టెంట్‌గానే చూడాలని, చిన్నపిల్ల అనుకోవద్దని తెలిపాడు. ‘కౌశల్‌ను నీ విషయంలో ఇతర కంటెస్టెంట్‌లు ప్రశ్నిస్తున్నా.. ఎందుకు సమాధానం చెప్పలేదని’ నాని ప్రశ్నించగా.. తాను ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందలేదని, అందుకే పట్టించుకోలేదన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ నుంచి దీప్తి ప్రొటెక్ట్ అయ్యారు. సామన్య కేటగిరిలో ఎంట్రీ ఇచ్చిన గణేశ్ అంచనాలు అందుకోవడంలేదని, భయపడవద్దని సూచించాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో నూతన నాయుడు ఫన్నీ డ్యాన్స్ నవ్వులు పూయించింది.
Comments
Please login to add a commentAdd a comment