'బిగ్ బాస్'లో నటుడు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షోలో నటుడు శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏం గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నారా, అసలు బిగ్ బాస్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోలో పాల్గొన్న ఇతర సభ్యులు ధన్‌రాజ్, సమీర్‌లు శివబాలాజీకి మద్ధతు తెలిపారు. అసలేమైందంటే.. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం స్మోక్ రూమ్‌లోకి ఒకసారి ఒకరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. తొలిరోజే ఒకేసారి ఐదుగురు స్మోక్ రూమ్‌లో ఉండటంతో బిగ్‌బాస్ వారిని హెచ్చరించారు. ప్రతిరోజు వారు ఈ రూల్ బ్రేక్ చేయడంతో బిగ్‌బాస్ వారికి పనిష్‌మెంట్ ఇవ్వాలనుకున్నారు.
రోజువారీగా ఇచ్చే సిగరెట్లను ఇవ్వడం తాత్కాలికంగా ఆపివేస్తున్నామని, తదుపరి నిర్ణయం వెల్లడయ్యేవరకు ఈ శిక్ష తప్పదని ఆదేశాలు రావడంతో స్మోకింగ్ అలవాటున్న కొందరు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు ఎలా ఉన్నా వందశాతం మనసుపెట్టి చేస్తున్నామని, అప్పుడప్పుడు తమ ఉల్లంఘనలకు ఇచ్చే శిక్షలను స్వీకరిస్తున్నా ఇంత కఠినంగా వ్యవహరించడం తమకు నచ్చలేదని శివబాలాజీ అన్నారు. తమకు ఏం లేక ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా.. అందరూ సెలబ్రిటీలే వారికి ఎలా నడుచుకోవాలో తెలుసునని, అయితే బిగ్‌బాస్ ఇంత స్టుపిడ్ నిర్ణయం తీసుకుంటారనుకోలేదని అభిప్రాయపడ్డారు. ధన్‌రాజ్, సమీర్, ముమైత్ ఖాన్ లు శివబాలాజీకి మద్దతు తెలిపారు.
తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బిగ్‌బాస్ సిగరెట్లు అందించినా.. ఒక్కరు స్మోక్ చేస్తున్నప్పుడు ఇతర 13 మంది సభ్యులు బాత్రూమ్‌లో ఉండాలని కండీషన్ పెట్టారు. కొందరు సభ్యులు ఒక్కొక్కరుగా స్మోక్ రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత బిగ్‌బాస్‌కు క్షమాపణ చెప్పారు. ఒక్క వ్యక్తి స్మోక్ చేస్తుంటే మిగిలిన 13 మంది బాత్రూమ్‌లో ఉండాలన్న కండీషన్‌ను రద్దు చేయాలని, మరోసారి స్మోక్ జోన్ రూల్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ఉంటామని.. ధన్‌రాజ్ సహా స్మోకింగ్ చేసే ఇతర సెలబ్రిటీలు బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశారు.