బిగ్‌బాస్ అంటేనే ఏదైనా జరుగొచ్చు. అది హౌజ్‌మేట్స్ పిచ్చితనం వల్ల కావచ్చు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల వల్ల కావచ్చు. ఎందుకంటే సోమవారం కార్యక్రమంలో ఏదో అనుకుంటే ఇంకెదో జరిగింది. కెప్టెన్ అయినందుకు తనీష్, కమల్ హాసన్ ఇచ్చిన స్పెషల్ పవర్ దృష్ట్యా అమిత్ ఈసారి కూడా ఎలిమినేషన్ పక్రియలో చోటు లేదు.
మిగతా ఇంటి సభ్యులందరిని ఇద్దరి చొప్పున ఓ జట్టు కట్టారు. ‘వారిలోంచి ఒకరు సేవ్ అవుతారు. మరొకరు డేంజర్‌జోన్‌లోకి వెళ్లి ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతారు. అయితే ఇందులో ఎవరి కారణాలు వారు విన్నవించుకోవచ్చు. ఆ కారణాలను పరిగణలోకి తీసుకుని తనీష్, అమిత్‌లు ఎవరిని సేవ్ చేయాలో, ఎవరిని డేంజర్ జోన్‌లో ఉంచాలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదీ ఈ వారం నామినేషన్ ప్రక్రియ’ అంటూ బిగ్‌బాస్ తెలిపాడు.
అయితే బిగ్‌బాస్ ఇచ్చింది ఒకటి. అక్కడ జరిగిందొకటి. ఎలిమినేషన్‌లోంచి సేవ్ అయి బయటకు వచ్చిన వారు కూడా తనీష్, అమిత్‌లతో పాటుగా నిర్ణయం తీసుకున్నారు. సరే అదంతా వదిలేద్దాం.. వారంతా ఏం చేసినా అంతిమ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. సేవ్ అయి బయటకు వచ్చిన వారు, డేంజర్ జోన్‌లోకి వెళ్లి నామినేట్ అయిన వారి కథ ఓ సారి చూద్దాం.
బిగ్‌బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న ఐదు డేంజర్ ప్లేసుల్లో ఐదు జంటలు నిలబడ్డాయి. సామ్రాట్-పూజ, గీతామాధురి-కౌశల్, నూతన్ నాయుడు-దీప్తి, శ్యామల-దీప్తి సునయన, రోల్ రైడా-గణేష్‌లు ఐదు జంటలుగా నిలబడ్డారు. మొదటి బెల్ మోగగానే సామ్రాట్, పూజలు వచ్చి వారు హౌజ్‌లో ఎందుకు ఉండాలనే కారణాలను చెప్పుకొచ్చారు. మొదట్నుంచీ నెగెటివ్‌గా ఉంటూ ఈ మధ్యే కొంచెం మారుతు.. పాజిటివ్ వైపు వస్తున్నానని, నా మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఇంకాస్త సమయం కావాలంటూ.. సామ్రాట్ తన కారణాలను వెల్లడించాడు. నేను వచ్చింది మధ్యలోనే ఇంకాస్త సమయం కావాలి అందరిని అర్థం చేసుకోవడానికి,అందరితో కలిసిపోవడానికి అంటూ పూజ చెప్పుకొచ్చింది. ఇక తనీష్, అమిత్‌లు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి.. పడుతూ, లేస్తూ.. ఎత్తు పల్లాలు చూసి .. ఇప్పుడిప్పుడే తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడని.. సామ్రాట్‌ను సేవ్ చేసి పూజను డేంజర్ జోన్‌లోకి పంపాడు.
ఇక బయటకు వచ్చిన సామ్రాట్ వారిద్దరు కలిసి తీసుకునే నిర్ణయాల్లో తలదూర్చాడు. రెండో జంటగా.. కౌశల్, గీతా మాధురిలు వచ్చారు. తాను హౌజ్‌లో మొదటునుంచీ, ఒంటరి పోరాటం చేస్తున్నానని, బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్‌లోనైనా.. మానసికంగా, శారీరకంగా తన వంతు కృషి చేస్తున్నాని, ఇంతవరకు తనకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని కౌశల్ తన కారణాలను తెలిపాడు. హౌజ్‌లో తాను ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది కలగదని, ప్రశాంత వాతావరణం ఉంటుందని, అందరితో కలిసి బాగుంటాను కాబట్టి నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాని గీత తన కారణాలను తెలిపింది. తనీష్, సామ్రాట్, అమిత్‌లు చర్చించుకుని.. గత వారం ఎలిమినేషన్ తనను డిస్సాప్పాయింట్ చేసిందని గీత అన్నారని.. హౌజ్‌లో ఇక ముందు టాస్క్‌లు అలానే ఉంటాయని తనీష్ చెప్పి.. కౌశల్‌ను సేవ్ చేశాడు.
గతంలో తన కోసం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడని.. ఇప్పుడు గణేష్ కోసం రోల్ రైడా తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని చెప్పి గణేష్‌ను సేవ్ చేశాడు. ఇక నూతన్ నాయుడు, దీప్తిలది మరో విచిత్రం. దీప్తి తాను హౌజ్‌లో ఉండడానికి గల కారణాలను తనేదో తన భాషలో చెప్పుకొచ్చింది. ఇక నూతన్ నాయుడు మాత్రం మిత్ర ధర్మం అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. కానీ, తాను ఉండటానికి గల కారణాలను చెప్పలేకపోయాడు. ఇక అంతిమ నిర్ణయం తీసుకోవడానికి అమిత్, తనీష్, సామ్రాట్ , కౌశల్‌లు చర్చించుకుని.. గత కొన్ని వారాలుగా టాస్కుల్లో బాగా చేస్తుందని, ఎంతో కష్టపడుతోందని దీప్తిని సేవ్ చేశారు.
ఇక శ్యామల, దీప్తి సునయనలది మరో గాథ. తాను మొదట్నుంచీ అందరితో బాగున్నాని, మొదటి వారంలో కెప్టెన్ లేకపోయినా అందరి బాగోగులు చూసుకున్నానని, తానుంటే ఎవరికి ఇబ్బంది ఉండదని, అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంటానని శ్యామల తన కారణాలను చెప్పుకొచ్చింది. మొదట్లో గేమ్‌ను సీరియస్‌గా తీసుకోలేదనీ, ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్నానని, హౌజ్‌లో ఉంటే ఇంక ఎంతో నేర్చుకుంటానని తన కారణాలను వివరించింది. అయితే ఈ అంతిమ నిర్ణయంలో.. తనీష్ రాకుండా.. అమిత్, సామ్రాట్, కౌశల్‌ను ముందుకు పంపాడు. తాను కూడా ఉంటే నిర్ణయం వేరే లాగా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక్కడే తనెంత బలహీనుడో తెలిసేలా చేశాడు. ఈ నిర్ణయంలో కూడా పాల్గొని ఇద్దరి కారణాలను, వారి ప్రతిభను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటే.. ప్రేక్షకుల దృష్టిలో ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యేవాడు. కానీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
దీప్తి సునయన హౌజ్‌లో ఉండేందుకు గల కారణాలను చెబుతుండగా.. కౌశల్ మధ్యలో కలగజేసుకుని శ్యామల కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నావా? అని అడిగితే.. కాదని ఒప్పుకుంది. అయితే వీరిద్దరిలో ఎవరిని సేవ్ చేయాలని అమిత్, కౌశల్, సామ్రాట్‌లు చర్చించుకుని.. తనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని ఒప్పుకోవడం వల్ల.. అందరం ఓ ఏకాభిప్రాయానికి వచ్చి.. శ్యామలను సేవ్ చేయాలనుకుంటున్నామని కౌశల్ తెలిపాడు. అయితే ఇలా ఐదు గురు డేంజర్ జోన్‌లోకి వెళ్లాక.. కెప్టెన్ అయిన కారణంగా స్పెషల్ పవర్‌తో.. ఇప్పటిదాకా సేవ్ అయిన కంటెస్టెంట్‌లోంచి ఒకరిని నామినేట్ చేయాలని తనీష్‌పై పిడుగును పడేశాడు బిగ్‌బాస్. ఇక్కడైనా తను సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తే... సేవ్ అయిన ఐదుగురిలో వీక్ కంటెస్టెంట్ ఎవరా? అని ఆలోచించకుండా.. అరవై మూడు రోజులు మాతో కలిసి ఆ నలుగురు ప్రయాణించారు.. శ్యామల వెళ్లిపోయి మధ్యలో వచ్చింది.. తనను నామినేట్ చేస్తున్నానని బిగ్‌బాస్‌కు తెలిపాడు.
గీతా మాధురి, శ్యామల, నూతన్ నాయుడు, రోల్ రైడా, పూజా రామచంద్రన్, దీప్తి సునయనలు ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు మజా మొదలైంది. బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన గీత ఎలాగూ ఎలిమినేట్ కాదని మెజారిటీ అభిప్రాయం. ఇటీవలె శ్యామల, నూతన్ నాయుడు ఇద్దరు గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. కాబట్టి వీరు కూడా వెళ్లే అవకాశం లేదనే చెప్పవచ్చు. పూజ వచ్చికొద్ది రోజులే అయినా... మంచి పేరే తెచ్చుకుంది. తనకు చాలానే ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక మిగిలిన వారిలో దీప్తి కంటే రోల్ రైడా కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా.. సోషల్ మీడియాలో దీప్తి సునయన హవానే ఉంటోంది. మరి వీరందరిలోంచి ఎవరు వెళ్తారో చూడాలి. ఆట మొదలైంది ఇప్పుడే కాబట్టి ఏదీ చెప్పలేం... ఈ వారం టాస్క్‌లు ఏముంటాయో.. వాటిని ఎలా నెట్టుకొస్తారో... చూద్దాం.. బిగ్‌బాస్ అంటే.. ఏదైనా జరుగొచ్చుగా!
చదవండి... బిగ్‌బాస్: బాబు గోగినేని ఔట్
Comments
Please login to add a commentAdd a comment