బిగ్‌బాస్‌లో సెలబ్రేషన్స్‌​.. ఎలిమినేషన్స్‌​.. ఎమోషన్స్‌ | Bigg Boss 3 Telugu Second Week Completed | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లో సెలబ్రేషన్స్‌​.. ఎలిమినేషన్స్‌​.. ఎమోషన్స్‌

Published Mon, Aug 5 2019 10:55 AM | Last Updated on Mon, Aug 5 2019 2:38 PM

Bigg Boss 3 Telugu Second Week Completed - Sakshi

ఎప్పుడూ గొడవలు, మనస్పర్థలు, అలకలతో ఉండే బిగ్‌బాస్‌ హౌస్‌ వీకెండ్‌లో వాటికి స్వస్తి చెప్పి ఉల్లాసంగా గడిచింది. పైగా ఆదివారం స్నేహితుల దినోత్సవం కావటంతో రాగద్వేషాలు మర్చిపోయి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ కట్టుకుంటూ డాన్సులు చేశారు. ఇస్మార్ట్‌ శంకర్‌ యూనిట్‌ హౌస్‌లో అడుగుపెట్టడంతో సంతోషాల సరదాలు మరింత జోరయ్యాయి. తీరా జాఫర్‌ ఎలిమినేట్‌ కావటంతో వీటన్నింటికి కాస్త బ్రేక్‌ను ఇచ్చినట్టయింది. జాఫర్‌ ఎలిమినేషన్‌తో ఇంటి సభ్యులు అందరూ విచారం వ్యక్తం చేయగా శ్రీముఖి, బాబా భాస్కర్‌లు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

శనివారం​ ఇలా..
బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను నాలుగున్నర కోట్ల మంది గమనిస్తున్నారని హోస్ట్‌ నాగార్జున తెలిపారు. రెండు వారాలకే ఇంటిలో గ్రూపులు తయారయ్యాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంటి సభ్యులు చేసిన తప్పులను ప్రస్తావిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వారిచేత నాగ్‌ హీరో-విలన్‌​ గేమ్‌ ఆడించడం ద్వారా ఒకరిపై ఒకరికి ఎలాంటి అభిప్రాయలు ఉన్నాయో బయట పడ్డాయి. ఈ ఆటలో వరుణ్‌ సందేశ్‌ను ఎక్కువ మంది విలన్‌గా అభిప్రాయపడగా, తర్వాతి స్థానంలో తమన్నా ఉంది. ఇక హీరోగా ఎక్కువ మంది ముక్త కంఠంతో బాబా భాస్కర్‌ను ఎంచుకున్నారు. చిన్న విషయానికి కూడా నోటికొచ్చినట్లు తిట్ల పురాణాన్ని ప్రారంభించే తమన్నాను నోటి దురుసును తగ్గించుకోవాలంటూ నాగ్‌ సూచించారు. రెండవవారం ఎలిమినేషన్‌లో 8మంది ఇంటి సభ్యులుండగా మహేష్‌, హిమజ, రాహుల్‌, శ్రీముఖిలు సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు నాగ్‌ ప్రకటించారు.

ఫన్‌డేగా మారిన సండే
వారం మొత్తం టాస్క్‌లు ఇచ్చిన బిగ్‌బాస్‌ వారాంతంలో వాటికి విరామాన్ని ఇచ్చాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావటంతో గిల్లికజ్జాలు పక్కనపెట్టి అందరూ ఉత్సాహంగా కనిపించారు. ఇంటి సభ్యుల్లో మీ జిగిరీ దోస్తులకు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టి దానికి కారణాలను నాగ్‌ చెప్పమన్నారు. ఇంటి సభ్యులందరూ ఒక్కొక్కరిగా వారి బెస్ట్‌ఫ్రెండ్‌కు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కడుతూ ఎందుకు ఇష్టమో వివరించారు. తర్వాత వారితో కలిసి పాటలకు స్టెప్పులేశారు. వారందరికీ సర్‌ప్రైజ్‌ను ఇస్తూ బిగ్‌బాస్‌ ఇంటిలోకి ఇస్మార్ట్‌ శంకర్‌ టీమ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌, హీరోయిన్‌ నిధి అగర్వాల్‌లు సందడి చేస్తూ ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకులను అలరించారు.

కన్నీటితో వీడ్కోలు..
హౌస్‌లోని కుటుంబ సభ్యుల్లో ఎక్కువమంది జాఫర్‌ను సేఫ్‌ చేయాలని భావించినప్పటికీ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం జాఫర్‌ను ఇంటి నుంచి పంపించేశారు. దీంతో శ్రీముఖి, బాబా భాస్కర్‌, మహేశ్‌లు కన్నీరు పెట్టుకున్నారు. వెక్కివెక్కి ఏడ్చిన శ్రీముఖిని ఓదార్చటం హౌస్‌లో ఎవరివల్లా కాలేదు. కుటుంబ సభ్యుల దగ్గర సెలవు తీసుకున్న జాఫర్‌... నాగార్జునతో మాట్లాడుతూ బిగ్‌బాస్‌లో జరిగేదంతా స్క్రిప్టు ప్రకారం జరుగుతుందని పొరపడ్డానని, అందుకు క్షమించమని వేడుకున్నాడు.

అనంతరం జాఫర్ బిగ్‌బాస్‌ ఇంట్లో గడిపిన రెండువారాల జర్నీని వీడియో చూపించారు. బయటికి వెళ్లేముందు ఇంటి సభ్యులతో జాఫర్‌ ముఖాముఖి జరిపారు. మీతోపాటు బయటికి ఎవరిని తీసుకెళ్లాలనుకుంటున్నారు అని నాగ్‌ ప్రశ్నించగా తనకెంతో ఇష్టమైన వరుణ్‌ను వెంటబెట్టుకుని వెళ్తానని చెప్పి బిగ్‌బాస్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. సండే అయిపోయింది. ఇప్పటివరకు ఇంటి నుంచి ఇద్దరు సభ్యులు ఎలిమినేట్‌ అయ్యారు. గండం గట్టెక్కింది అనుకుంటున్న కుటుంబ సభ్యుల్లో సోమవారం ఎవరు నామినేట్‌ కానున్నారో చూడాలి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement