
మా ఇద్దరి మధ్య విభేదాలు లేవు!
‘‘ఇది రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో నక్షత్రంలా మెరిసిపోవాలని, పోటీలో ముందుండాలని అందరికీ ఉంటుంది. ఆ పోటీ కారణంగా మనస్పర్థలు రావడం సహజం’’ అంటున్నారు తమన్నా. బిపాసా బసు, ఇషా గుప్తా, తమన్నా నాయికలుగా రూపొందిన ‘హమ్ షకల్స్’ ఈ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రదర్శకుడు సాజిద్‌ఖాన్‌తో తమన్నాకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందుకని మిగతా ఇద్దరు తారలకన్నా తమన్నాకి ప్రాధాన్యం ఇస్తున్నారనే వార్త వినిపిస్తోంది.
ఈ కారణంగా తమన్నాపై బిపాసా ఆగ్రహంగా ఉన్నారని బాలీవుడ్ టాక్. ఈ విషయం గురించి, ఈ సినిమాలో తన పాత్రకున్న ప్రాధాన్యం గురించి తమన్నా చెబుతూ - ‘‘నేనో సినిమా అంగీకరించేటప్పుడు కథ, నా పాత్ర గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటాను. ‘హమ్ షకల్స్’లో నా పాత్ర నిడివి, ప్రాధాన్యం గురించి సాజిద్ ఖాన్ ఏదైతే చెప్పారో అలానే తీశారు. అందుకని, నాకెలాంటి అసంతృప్తీ లేదు. ఇద్దరు, ముగ్గురు కథానాయికలు కలిసి నటించినప్పుడు ఎవరి పాత్ర బాగుంటుంది? ఎవరికి ఎక్కువ పేరొస్తుంది? అని ఆలోచించడం సహజం.
ఈ క్రమంలో మనస్పర్థలు నెలకొనడం, కొన్ని సందర్భాల్లో మాటా మాటా అనుకోవడం జరుగుతుంది. పోటీ ప్రపంచంలో జరిగే ఇలాంటి విషయాలను బయటివాళ్లు చిలవలు పలవలు చేసేస్తారు. వాస్తవానికి బిపాసా, నేను మాటా మాటా అనుకున్నది లేదు. గొడవ పడిందీ లేదు. మా కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలు లేవు. అందుకని, మా మధ్య స్నేహం పెరగలేదు. కానీ, తనతో కలిసి షూటింగ్ చేసినప్పుడు, నాకెలాంటి అసౌకర్యం కలగలేదు. బిపాసా మంచి కో-స్టార్. నాకెవరితోనూ గొడవలు లేవు. ఎందుకంటే, నాకసలు అభద్రతాభావమే లేదు’’ అని స్పష్టం చేశారు.