రెండు రోజుల పాత్రకు 28 లక్షలా?
రెండు రోజుల పాత్రకు 28 లక్షలా?
Published Tue, Apr 15 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
మూడు పదుల వయసులో కూడా కుర్రకారు హాట్ ఫేవరెట్‌గా భాసిల్లుతున్న బాలీవుడ్ తార బిపాసాబసు. గతంలో ఉన్నంత హవా ఇప్పుడు లేకపోయినా... ఖాళీగా అయితే లేరు ఆమె. ‘టక్కరి దొంగ’ తర్వాత దక్షిణాదిలో బిపాసా ఏ సినిమా చేయలేదు. ఆమెను దక్షిణాదిలో నటింపజేయాలని పలు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. ఇటీవలే అలాంటి ఓ విఫలయత్నం జరిగింది. కన్నడం నుంచి బిప్స్‌కి ఓ ఆఫర్ వచ్చింది. సినిమా పేరు ‘మమ్ము టీ అంగడి’. ఇందులో ఓ అతిథి పాత్ర ఉంది. రెండు రోజులు మాత్రమే షూటింగ్. దానికే 28 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తామని సదరు చిత్ర దర్శక, నిర్మాతలు బిప్స్ ముందు భారీ ఆఫర్ ఉంచారట. నిజానికి అంత చిన్న పాత్రకు ఆ స్థాయి పారితోషికం ఎవ్వరూ ఇవ్వరు. కన్నడంలో హీరోయిన్లకు కూడా ఇవ్వనంత పారితోషికం అది.
అయితే... అంతటి ఆఫర్‌నీ సున్నితంగా తిరస్కరించారు బిపాసా. ఈ ఆఫర్‌ని బిప్స్ తిరస్కరించడానికి కారణం పారితోషికం నచ్చకనే అని బాలీవుడ్ టాక్. తన పారితోషికం రెండు కోట్ల పై మాటేనని, తాను అతిథి పాత్ర చేస్తే యాభై లక్షలైనా ఇవ్వడం న్యాయమని బిప్స్ తన సహచరులతో ఉన్నట్లు సమాచారం. 28 లక్షలంటే సాధారణమైన విషయం కాదని, పైగా రెండు రోజుల్లో అంత మొత్తం ఇస్తామంటే వదులుకోవడం సరైన పని కాదని సన్నిహితులు నచ్చజెప్పినా బిపాసా ససేమిరా అంటున్నారట. నేను నటిస్తే ఆ సినిమాకు క్రేజ్ రాదా? అమ్మేటప్పుడు నా పేరు వాడుకోరా? అలాంటప్పుడు నాకు యాభై లక్షలిస్తే తప్పేంటట అనేది బిపాసా వాదన. బిపాసా వాదనలో కూడా నిజం లేకపోలేదు. ఏమంటారు?
Advertisement
Advertisement