
రోబోలే కాదు...పక్షులు కూడా!
ఓ శాస్త్రవేత్త సృష్టించిన రోబో అతడికి ఎదురు తిరిగితే? అమ్మాయితో ప్రేమలో పడితే? రజనీకాంత్ ‘రోబో’లో దర్శకుడు శంకర్ చూపించిన కాన్సెప్ట్ అదే కదా! అందులో రోబోలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా ‘2.0’ వస్తోంది. ఇందులో రోబోలే కాదు... పక్షులూ నటిస్తున్నాయి. సినిమాను ముందుకు తీసుకువెళ్లడంతో పక్షులే కీలక పాత్ర పోషిస్తాయట! హిందీ హీరో అక్షయ్‌కుమార్ ఈ సినిమాలో దుష్టుడైన ఓ శాస్త్రవేత్త పాత్రలో విలన్‌గా కనిపిస్తారు. ఇప్పటికే విడుదల చేసిన అక్షయ్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఇందులో అక్షయ్ పక్షుల ప్రేమికుడిగా నటిస్తున్నారట! అంతే కాదు... సినిమా మెయిన్ థీమ్ అంతా పక్షులు, వాటి లక్షణాల చుట్టూ ఉంటుందట!
‘‘అందుకనే ఈ చిత్రం షూటింగ్ కోసం మకావ్స్, కాకటోస్, బూడిద రంగులో ఉండే ఆఫ్రికన్ రామచిలుకలు తదితర అరుదైన పక్షులను తీసుకొచ్చారు. చెంగల్‌పట్టు, తిరుక్కళకుండ్రమ్ దగ్గరలో వేసిన భారీ సెట్‌లో ఆ పక్షులతో పాటు అక్షయ్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. మొత్తం మీద ‘2.0’ కాన్సెప్టే కాదు, సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తుండడం కూడా భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కోసమే 350 కోట్లు అనుకున్న బడ్జెట్‌ను 400 కోట్లకు పెంచారు. ప్రస్తుతం ఆసియాలోనే భారీ బడ్జెట్ చిత్రమిదే అంటున్నారు. బడ్జెట్‌కు తగ్గట్టు తెలుగు, తమిళం, హిందీలతో పాటు పలు భారతీయ భాషల్లోనూ, విదేశాల్లోనూ భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. నేరుగా 3డిలోనే తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి రిలీజయ్యే లోగా ఇంకెన్నో విశేషాలు బయటకొస్తాయనడంలో సందేహం ఏముంది!