‘‘కళలపై రసమయికి ఉన్న మక్కువతో ‘తుపాకి రాముడు’ సినిమాని నిర్మించాడు. బిత్తిరి సత్తి గురించి అందరికీ తెలిసిందే. వీరు కలిసి చేసిన ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వమని నిర్మాత ‘దిల్’ రాజుతో మాట్లాడాను. కొంత నష్టమైనా భరించాలని చెప్పాను. ఆయన ధైర్యంగా ముందుకొచ్చారు’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బిత్తిరి సత్తి, ప్రియ జంటగా టి. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తుపాకి రాముడు’.
రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్ బిగ్ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి ఓ సినిమా చేశాడు. ఇప్పుడు హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందర్నీ తెలంగాణ వారినే పెట్టి మంచి సినిమా తీశాడు. తెలంగాణ కళలు, సంప్రదాయాలు, బతుకమ్మ పండగ గురించి తీసిన సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకాదరణతో 100 రోజులు ఆడాలి’’ అన్నారు.
‘‘శంకర్ అన్నలా ‘శ్రీరాములయ్య’ వంటి గొప్ప సినిమా తీయాలనే నా కోరిక ‘తుపాకి రాముడు’తో తీరింది. సినిమా నిర్మించడం కంటే విడుదల చేయడం కష్టమని ‘దిల్’ రాజుగారిని కలిశాక తెలిసింది’’ అని రసమయి బాలకిషన్ అన్నారు. ‘‘ఎప్పుడూ నవ్వించే సత్తి ఈ చిత్రంతో ఏడిపిస్తాడు కూడా’’ అని బిత్తిరి సత్తి అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిర్మాత శివకుమార్, నటులు రాజ్ తరుణ్, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment