Rasamai Balakishon
-
తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి
‘‘కళలపై రసమయికి ఉన్న మక్కువతో ‘తుపాకి రాముడు’ సినిమాని నిర్మించాడు. బిత్తిరి సత్తి గురించి అందరికీ తెలిసిందే. వీరు కలిసి చేసిన ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వమని నిర్మాత ‘దిల్’ రాజుతో మాట్లాడాను. కొంత నష్టమైనా భరించాలని చెప్పాను. ఆయన ధైర్యంగా ముందుకొచ్చారు’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బిత్తిరి సత్తి, ప్రియ జంటగా టి. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తుపాకి రాముడు’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్ బిగ్ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి ఓ సినిమా చేశాడు. ఇప్పుడు హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందర్నీ తెలంగాణ వారినే పెట్టి మంచి సినిమా తీశాడు. తెలంగాణ కళలు, సంప్రదాయాలు, బతుకమ్మ పండగ గురించి తీసిన సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకాదరణతో 100 రోజులు ఆడాలి’’ అన్నారు. ‘‘శంకర్ అన్నలా ‘శ్రీరాములయ్య’ వంటి గొప్ప సినిమా తీయాలనే నా కోరిక ‘తుపాకి రాముడు’తో తీరింది. సినిమా నిర్మించడం కంటే విడుదల చేయడం కష్టమని ‘దిల్’ రాజుగారిని కలిశాక తెలిసింది’’ అని రసమయి బాలకిషన్ అన్నారు. ‘‘ఎప్పుడూ నవ్వించే సత్తి ఈ చిత్రంతో ఏడిపిస్తాడు కూడా’’ అని బిత్తిరి సత్తి అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిర్మాత శివకుమార్, నటులు రాజ్ తరుణ్, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి...
సాక్షి, అల్గునూర్: ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని..టీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ అభ్యర్థి రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, కొత్తపల్లి, గొల్లపల్లి, నుస్తులాపూర్, నేదునూర్, లక్ష్మీదేవిపల్లి, వచ్చునూర్, జూగుండ్ల, రామ్హనుమాన్నగర్ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. తెలంగాణకు ద్రోహం చేసిన టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. మూడు నెలల్లో గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీరందిస్తామన్నారు. తిమ్మాపూర్ మండలం రైతులకు గోదావరి నీరు అందిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇస్తామని..సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బులు కూడా ఇస్తామని వెల్లడించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే బంగారు తెలంగాణ సంకల్పం నెరవేరుతోందని తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
దళితుల ఆత్మహత్యాయత్నంపై నిరసనలు
సీఎం, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దహనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ఎదుట ఆదివారం సాయంత్రం ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై కరీంనగర్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఎమ్మార్పీఎస్ తదితర పార్టీలతోపాటు అంబేడ్కర్, దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూరు, శంకరపట్నం తదితర మండలాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వం, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే దళితులు మహంకాళి శ్రీనివాస్, పరశురాంలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని, తక్షణమే ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బాలకిషన్ తదితరులపై కేసు నమోదు చేసి, దళితుల ఆత్మహత్యాయత్నం సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మహత్యాయత్నం ఘటనపై జిల్లావ్యాప్తంగా మంగళవారం ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దళితులను వంచిస్తున్న ప్రభుత్వం: భట్టి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భూ పంపిణీ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను వంచిస్తోందని, ఇందులో అవకతవకలు, అవినీతి రాజ్యమేలుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఇక్కడ విమర్శించారు. యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వానికి కనువిప్పు జరగడం లేదన్నారు. తాను అధికార పార్టీకి టచ్‌లో ఉన్నానంటూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఒక పవర్ బ్రోకర్ అని భట్టి విక్రమార్క అన్నారు.