దళితుల ఆత్మహత్యాయత్నంపై నిరసనలు
సీఎం, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దహనం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ఎదుట ఆదివారం సాయంత్రం ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై కరీంనగర్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఎమ్మార్పీఎస్ తదితర పార్టీలతోపాటు అంబేడ్కర్, దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూరు, శంకరపట్నం తదితర మండలాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ప్రభుత్వం, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే దళితులు మహంకాళి శ్రీనివాస్, పరశురాంలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని, తక్షణమే ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బాలకిషన్ తదితరులపై కేసు నమోదు చేసి, దళితుల ఆత్మహత్యాయత్నం సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మహత్యాయత్నం ఘటనపై జిల్లావ్యాప్తంగా మంగళవారం ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
దళితులను వంచిస్తున్న ప్రభుత్వం: భట్టి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భూ పంపిణీ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులను వంచిస్తోందని, ఇందులో అవకతవకలు, అవినీతి రాజ్యమేలుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఇక్కడ విమర్శించారు. యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వానికి కనువిప్పు జరగడం లేదన్నారు. తాను అధికార పార్టీకి టచ్‌లో ఉన్నానంటూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఒక పవర్ బ్రోకర్ అని భట్టి విక్రమార్క అన్నారు.