ఒకరి బలహీనత ఇంకొకరికి ఆసరా. అవసరాన్ని తీర్చే మార్గం. మరీ మధ్యతరగతి వర్గన్ని బతికిస్తున్నవి ఇలాంటి బలహీనతలే! ఇదే బ్లాక్‌మేల్ సినిమా! చాలా సీరియస్ విషయాన్ని హాస్యాన్ని జోడించి ఎంతో చతురంగా చెప్పిన చిత్రం!
కథ...
దేవ్ (ఇర్ఫాన్ ఖాన్) టిష్యూ పేపర్స్ తయారు చేసే కంపెనీలో సేల్స్ మ్యాన్. బాధ్యతలు తప్ప సుఖం, సంతోషం లేని మిడిల్‌క్లాస్ హజ్బెండ్. ముద్దుముచ్చటా లేని కాపురం. ఆఫీస్‌లో అందరూ వెళ్లిపోయే వరకు ఉండి, వీడియో గేమ్ ఆడి, భార్య నిద్రపోయాక ఇంటికెళ్తాడు. డైనింగ్ టేబుల్ మీద చల్లారిన భోజనాన్ని ఓవెన్‌లో పెట్టి, డైనింగ్ హాల్‌కీ బెడ్‌రూమ్‌కీ మధ్య ఉన్న తలుపు కన్నంలోంచి... ఆదమరిచి నిద్రపోతున్న భార్య అందాన్ని ఆస్వాదిస్తాడు. ఈలోపు ఓవెన్‌లో భోజనం వేడి అయిపోయినట్టు అలారమ్ వస్తుంది. నిట్టూర్చి భోజనం అయిందనిపించి వెళ్లి పడుకుంటాడు. ఇంచుమించు ఇదే దిన చర్య దేవ్‌ది.
గులాబీపూలు... నిజాల ముళ్లు
దేవ్ ఉదాసీనతను చూసి అతని కొలీగ్ ఆనంద్.. ‘‘కొన్నాళ్లుగా చూస్తున్నా. ఎందుకింత ఉదాసీనంగా ఉంటున్నావ్? అసలు కొత్త కాపురంలోని మొగుడులాగా ఉన్నావా? ఎందుకు ఏమైంది? కలహాలా?’’ అంటూ స్నేహితుడిని అడుగుతాడు. ముభావంగా ఉంటాడు దేవ్. ‘‘పువ్వులు ఇష్టపడని భార్య ఉండదు. సో.. ఈ రోజు పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికెళ్లి నీ భార్యకు సర్‌ప్రయిజ్ ఇవ్వు’’ అని దేవ్‌ను ఉత్సాహపరుస్తాడు ఆనంద్.
అన్నట్టుగానే పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికొస్తాడు దేవ్. ఎప్పటిలాగే డైనింగ్ హాల్, బెడ్‌రూమ్‌కి మధ్యనున్న కన్నంలోంచి చూస్తాడు. షాక్... రీనా (కీర్తి కుల్హరి) ఇంకో వ్యక్తితో కనిపిస్తుంది. ఆవేశం పొంగుతుంది. వెళ్లి భార్య పక్కనున్న అతణ్ణి చంపేయాలనుకుంటాడు. ఏమీ చేయలేక.. భార్యనూ నిలదీయలేక నిస్సహాయంగా వెనుదిరుగుతాడు. తన ఇంట్లోంచి ఆ వ్యక్తి బయటకు వచ్చే వరకు అపార్ట్‌మెంట్ కాంపౌండ్‌లో నిరీక్షించి ఆ వ్యక్తి బయటకు వచ్చాక అతణ్ణి ఫాలో అవుతాడు.
బ్లాక్‌మెయిల్స్...
భార్య స్నేహితుడి పేరు రంజిత్ అని, ఓ బడా వ్యాపారి అల్లుడని తెలుసుకుంటాడు ఆ ఇంటి వాచ్‌మన్ ద్వారా. నిజానికి రంజిత్ (అరుణోదయ్ సింగ్), రీనా (దేవ్ భార్య)పెళ్లికి ముందే ప్రేమికులు. కాని డబ్బు కోసం డాలీ (దివ్య దత్తా)ను పెళ్లిచేసుకుంటాడు. జిమ్ ట్రైనర్ అయిన రంజిత్ వేరే పనేమీ లేకుండా అత్తింటి సొమ్ము మీద బతుకుతుంటాడు. దాంతో భర్తంటే చాలా చులకన డాలీకి. ఇంచుమించు పెంపుడు కుక్కలా ట్రీట్ చేస్తుంటుంది అతనిని.
దాంతో ఆత్మాభిమానం దెబ్బతిని మళ్లీ పాత స్నేహితురాలు రీనాతో సంబంధం పెట్టుకుంటాడు రంజిత్. అలా వాళ్లిద్దరి స్నేహం కొనసాగుతుంది. ఈలోపు దేవ్‌కు నెల తిరిగేసరికల్లా ఇంటి ఈఎమ్‌ఐ, కార్ ఈఎమ్‌ఐ, కేబుల్ పేమెంట్.. ఎట్‌సెట్రా తడిసిమోపెడవుతాయి. ఆఫీస్‌లో ఆ నెల ఇంక్రిమెంట్ ఉంటుంది కదా.. అన్నీ తీర్చేయొచ్చు అనుకుంటే.. ‘‘కంపెనీ సేల్స్ మందగించాయి, పైగా కంపెనీ ఎక్స్‌పాన్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది. అందుకే ఇంక్రిమెంట్స్ లేవు’’ అంటూ చావు కబురు చల్లగా చెప్తారు. టెన్షన్‌లో పడ్తాడు దేవ్.
అప్పుడు ఒక బేసిక్ మోడల్ ఫోన్ కొని, దాన్లో ప్రీపెయిడ్ సిమ్ వేసి, రాత్రి దొంగతనంగా భార్య ఫోన్‌లోంచి రంజిత్ ఫోన్ నంబర్ తస్కరించి ‘‘పెళ్లయిన మహిళతో అఫైరా?’’ అంటూ బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్‌కు. భయపడ్డ రంజిత్.. ‘‘ఏం కావాలి?’’ అని అడుగుతాడు. ఈఎమ్‌ఐల లెక్కలు వేసుకొని లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాడు. క్రాస్‌బ్రీడ్ డాగ్స్ బిజినెస్ చేస్తున్నాను, ఒక లక్ష రూపాయలివ్వమని అబద్ధం చెప్పి భార్య దగ్గర డబ్బులు తీసుకొని దేవ్‌కిస్తాడు రంజిత్. అలా భార్య ఎఫైర్‌ను మనీ సంపాదన వనరుగా మార్చుకుంటాడు దేవ్. మధ్యతరగతి విలువలు అతనిని కుళ్లబొడుస్తుంటాయి.
ఆ అపరాధ భావనను ఓ రోజు బార్‌లో కొలీగ్ ఆనంద్‌తో పంచుకుంటాడు. ఆనంద్ ఆ విషయాన్ని తన ఆఫీస్‌లోని కొత్త ఫీమేల్ కొలీగ్ ప్రభకు చెప్తాడు. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని ప్రభ మళ్లీ దేవ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. అయితే బిజినెస్ పేరుతో కూతురు దగ్గర అల్లుడు డబ్బు తీసుకున్నాడని తెలిసి డాలీ తండ్రి రంజిత్‌ను బెదిరిస్తాడు రెండు రోజుల్లో లక్ష రూపాయలు తిరిగి ఇవ్వమని. ఏం చేయాలో పాలుపోక ఒక డూప్లికేట్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి గర్ల్ ఫ్రెండ్ రీనాకు బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్– ‘‘పెళ్లయిన వాడితో ఎఫైరా?’’అంటూ.
ఈ విషయం నీ భర్తకు తెలియకుండా ఉండాలంటే లక్షా 30 వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. రీనా తండ్రి కిడ్నీ జబ్బుతో బాధపడ్తుంటాడు. డబ్బు కోసం తల్లి దగ్గరకు వెళ్తుంది రీనా. ఉన్న డబ్బంతా మీ నాన్న కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడానికే అయిపోయిందంటుంది తల్లి. దాంతో రీనా తన భర్తనే అడుగుతుంది తండ్రి వైద్య పరీక్షల కోసమని. రంజిత్ దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేస్తాడు. మళ్లీ రంజిత్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఇలా ఈ సైకిల్ అందులో ఇన్‌వాల్వ్ అయిన వాళ్ల, ఆ విషయం తెలిసిన వాళ్ల చుట్టూ తిరుగుతుంటుంది.
ప్రైవేట్ డిటెక్టివ్..
ఈ బ్లాక్‌మెయిల్ బెడద తొలగించుకోవాలని రంజిత్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను మాట్లాడుకుంటాడు. ఆ డిటెక్టెవ్ రంజిత్‌కు ఫోన్ చేస్తున్న నంబర్ రీనా భర్తదేనని తెలుసుకుంటాడు. రంజిత్‌కు చెప్పకుండా పరిశోధన పేరుతో డ్రాగ్ చేస్తూ దేవ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు.. ‘‘నీ బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది నీ భర్తనేని నీ భార్యతో చెప్తాన’’ంటూ. ఖంగు తింటాడు దేవ్. ఈలోపు ప్రభ ఒత్తిడి ఎక్కువవుతుంది దేవ్‌కి. ఆమెను కన్విన్స్ చేయడానికి వాళ్లింటికి వెళ్దామనుకొని ఆమె ఇంటి అడ్రస్ కోసం ఆనంద్‌ను అడుగుతాడు.
ఆ రాత్రి ప్రభ వాళ్లింటికి వెళ్తాడు దేవ్. వాదోపవాదాలు జరిగి దేవ్ వెళ్లిపోతుంటే ఆయనను ఆపడానికి వెళ్లి బాటిల్ మీద కాలు పడి జారి వెనకాల అల్మారాకు కొట్టుకుంటే అల్మారా మీద పడి ప్రభ చనిపోతుంది. భయపడి పారిపోతాడు దేవ్. కాలనీ వాసులు ఆయనని తరుముతాడు. అయినా తన అనవాలు చిక్కనివ్వకుండా తప్పించుకుంటాడు. మర్నాడు ఆఫీస్‌కు పోలీస్‌లు వస్తారు ఎంక్వియిరీ కోసం. ఆనంద్‌కు దేవ్ మీద డౌట్ వస్తుంది.
ప్రభ అంటే ఆనంద్ ఇష్టపడుతున్నాడని పోలీసులకు చెప్పి డౌట్ ఆనంద్ మీదకు మళ్లేట్టు చేస్తాడు దేవ్. ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్‌చేస్తారు. అప్పుడు తన భార్య ఎఫైర్ విషయం తెలిసి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, ఆ విషయం ప్రభకు తెలిసి... దేవ్‌ను ప్రభ బ్లాక్‌మెయిల్ చేసిందని అందుకే దేవే ఆమెను చంపి ఉంటాడని పోలీసులకు చెప్తాడు ఆనంద్. ఇన్‌స్పెక్టర్ దేవ్‌ను బెదిరిస్తాడు. ఈ లోపు ప్రైవేట్ డిటెక్టివ్ పోరు ఎక్కువవుతుంది దేవ్‌కి. అటు రంజిత్‌కు మామ పోరూ ఎక్కువవుతుంది.
డాలీకి భర్త ఎఫైర్ విషయం తెలిసి, భర్తను చంపేయాలనుకుంటుంది. కాని అంతకుముందే రంజిత్ ప్రైవేట్ డిటెక్టివ్ చెప్పిన వ్యక్తి దగ్గర ఒక నాటు తుపాకీ కొనుక్కుంటాడు. కత్తితో తన వెనకాల పొడిచిన భార్యను తుపాకితో కాల్చి చంపేస్తాడు. డబ్బు కోసం మళ్లీ రీనాను బ్లాక్‌మెయిల్ చేస్తాడు రంజిత్ అపరిచిత మెయిల్ ద్వారా. రీనా మళ్లీ దేవ్‌ను డబ్బులు అడుగుతుంది తండ్రి వైద్యం కోసం. ఇవ్వనంటాడు. అపాలజీ చెప్పడానికి రీనా తల్లికి ఫోన్ చేస్తే రీనా అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది దేవ్‌కి.
అప్పుడు మొత్తం విషయం తెలుస్తుంది. తను డబ్బు కోసం రంజిత్‌ను బ్లాక్‌మెయిల్ చేయడం, రంజిత్ రీనాను బ్లాక్ మెయిల్ చేయడం. ఆ నిజాన్ని సాక్ష్యాలతో సహా రీనాకు పంపిస్తాడు దేవ్. రియౖలైజై రంజిత్ స్నేహానికి స్వస్తి చెప్పి అతని నంబర్ డిలీట్ చేస్తుంది రీనా. ఆనంద్‌కూడా దేవ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. ఆలోచించి ఓ ప్లాన్ వేస్తాడు దేవ్. ‘‘నువ్వు అడిగినంత డబ్బిస్తాను. కాని నిన్ను బ్లాక్‌మెయిల్ చేస్తోంది ఆనంద్ అని రంజిత్‌తో చెప్పు’’అంటాడు దేవ్.. ప్రైవేట్ డిటెక్టివ్‌తో.
అలాగే చెప్తాడు ప్రైవేట్ డిటెక్టివ్. ఈ బ్లాక్‌మెయిలర్‌కు గుణపాఠం చెప్పాలనే ఆవేశంతో ఉన్న రంజిత్... ప్రైవేట్ డిటెక్టివ్ ఇచ్చిన సమాచారంతో ఆనందే అసలు బ్లాక్‌మెయిలర్ అనుకొని అతనిని చంపేస్తాడు. ఈ క్రమంలో తన కూతురిని చంపింది అల్లుడే అన్న నిజమూ తెలుస్తుంది రంజిత్ మామకు. అలా రంజిత్ దోషిగా దొరికిపోతాడు. దేవ్ కోసం రీనా ఆ రాత్రి భోజనం వండి టేబుల్ మీద సర్ది ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడొస్తావ్ ఇంటికి అని మెస్సేజ్ పెట్టి.
ఆ మెస్సేజ్ వచ్చేటప్పటికీ దేవ్ ఎప్పటిలా రాత్రి ఆఫీస్‌లో వీడియో గేమ్ ఆడ్తుంటాడు. చిత్రంగా విన్ అవుతాడు. భార్య మెస్సేజ్ చూసి ఆమె నంబర్ డిలిట్ చేసేస్తాడు. సామాన్యుడు తనే సమస్యలను సృష్టించుకుని ఆ సుడిగుండంలో కొట్టుకుపోతాడు అనే సారాంశం ఈ బ్లాక్‌మెయిల్. దేవ్‌గా ఇర్ఫాన్ అద్భుతం. రంజిత్‌గా అరుణోదయ్ కూడా సూపర్బ్. ఇక కీర్తి కుల్హరి గురించి వేరేగా చెప్పక్కర్లేదు. సున్నితమైన హాస్యంతో గొప్ప సమస్యను చిత్రీకరించిన తీరు అద్భుతం. మల్టీప్లెక్స్‌ల్లో ఆడుతోంది. తప్పక చూడండి.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment