‘బాబీ’ బాగా నవ్విస్తుంది | 'Bobby Jasoos' is a wholesome entertainer, says Dia Mirza | Sakshi
Sakshi News home page

‘బాబీ’ బాగా నవ్విస్తుంది

Published Sat, Mar 15 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

'Bobby Jasoos' is a wholesome entertainer, says Dia Mirza

న్యూఢిల్లీ: త్వరలో విడుదలయ్యే బాబీ జసూస్ దియా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని దీని నిర్మాత, హైదరాబాదీ బ్యూటీ దియా మీర్జా హామీ ఇస్తోంది. సాధారణంగా మహిళల ఆధారిత సినిమాల్లో హాస్యం తక్కువగా ఉంటుందని, ఇప్పుడు వినోదాత్మక సినిమాలు కూడా వస్తున్నాయని చెప్పింది. ‘మన సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది కానీ కథలో వాళ్ల ప్రమేయం తక్కువ. గ్లామర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతారు. మా బాబీ జసూస్ గూఢచారి సినిమా. ఎప్పుడూ పురుషులే నటించే డిటెక్టివ్ పాత్ర ఇందులో విద్యాబాలన్ చేసింది’ అని దియా వివరించింది. ఈ సినిమాలో గడ్డం, చింపిరి జట్టుతో మగ బిచ్చగాడిలా విద్యాబాలన్ కనిపిస్తున్న ప్రచారం ఫొటోలు గతవారం విడుదలై చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. ఇక సినిమా విజయంపై దియా ఎంతో ధీమాగా ఉంది. 
 
 ఇది పురుషులతోపాటు మహిళలనూ ఆకట్టుకుంటుందని, కుటుంబ సభ్యులంతా కలిసి చూడవచ్చని నమ్మకంగా చెబుతోంది. సమర్ షేక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దియాకు చెందిన బార్న్ ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈమె 2011లోనూ లవ్ బ్రేకప్స్ జిందగీ తీసింది. నిర్మాతగా మారడం ఎలా అనిపిస్తోందంటే.. ‘పని చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలు తీయడం మత్తుమందు వంటిది. ఒకసారి ఇందులోకి దూకామంటే బయటికి రావడం కష్టం. నిర్మాతను అయిన తరువాత నటనకు కొంచెం దూరం కావడం బాధగానే అనిపిస్తోంది. సినిమాను నిర్మించడమనేది చాలా పెద్ద బాధ్యత’ అని ఈ 32 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే వస్త్రాలతో దియా వేదికపై మెరిసింది. ‘ఫ్యాషన్ వేదికలకు రావాలంటే ఇప్పటికీ భయమే. క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు ఎంతో కంగారుగా అనిపిస్తుంటుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రోత్సాహం శక్తిని ఇస్తుంటుంది. అందుకే పని సులువు అవుతుంది’ అని దియా మీర్జా వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement