బాడీ బస్టర్స్ | Body Busters | Sakshi
Sakshi News home page

బాడీ బస్టర్స్

Published Wed, Jun 22 2016 11:54 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Body Busters

ఇది సి.జి వర్క్ కాదు.  కెమెరా ట్రిక్కు కాదు. రియల్ మజిల్. కండలు తిరగాలి. ఒళ్లు రాటు దేలాలి. కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ కావాలి. నేటి హీరోలు సినిమా చెక్కిన శిల్పాలు. సక్సెస్ కోసం సినిమాలు మోయడానికి  సిద్ధపడ్డ హెర్క్యులెస్‌లు. బాలీవుడ్‌లోనూ టాలీవుడ్‌లోనూ కండలను తీర్చిదిద్దుకునే ప్రోగ్రామ్ నడుస్తోంది. కలెక్షన్లలో బ్లాక్‌బస్టర్ కావాలంటే  ఇలా బాడీ బస్టర్  తప్పడం లేదు.
 సల్మాన్ కుస్తీ
 ‘దంగల్’లో ఆమిర్ కనిపించినట్లుగానే ‘సుల్తాన్’లో సల్మాన్ యంగ్ రెజ్లర్‌గా, ఫిఫ్టీ ప్లస్ మ్యాన్‌గా కనిపిస్తారు. హర్యానాలోని చిన్న టౌనులో ఉండే సుల్తాన్ అలీ ఖాన్ అనే మల్లయోధుడి కథ ఇది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి అతను ఏం చేశాడు? ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? అనేది కథ. ‘సుల్తాన్’కి ముందు సల్మాన్ ఖాన్ బరువు 88 కిలోలు. ఈ సినిమా కోసం ఆరు కిలోలు పెరిగారు. అంటే ‘సుల్తాన్’ షూటింగ్ స్టార్ట్ చేసే సమయానికి 94 కిలోలు ఉన్నారు.
 
 బరువు పెరిగిన సన్నివేశాలు తీసిన తర్వాత తగ్గారు. పెరగడం సల్మాన్‌కి పెద్ద కష్టం కాలేదు కానీ, తగ్గడం మాత్రం చాలా కష్టమైంది. ఎందుకంటే పెరిగిన ఆరు కిలోలు మాత్రమే కాదు.. మొత్తంగా 24 కిలోలు తగ్గించాల్సి వచ్చింది. ‘సుల్తాన్’కి ముందు 88 కిలోల బరువుతో ఉన్న సల్మాన్  ఈ చిత్రంలో 94 కిలోలతో పాటు 70 కిలోల బరువుతో కూడా కనిపిస్తారు.
 
గతేడాది డిసెంబర్‌లో ‘సుల్తాన్’ షూటింగ్ మొదలైంది. అంతకు రెండు నెలల ముందు బరువు పెరిగే పని మొదలుపెట్టారు. మొత్తం బాడీ కాకుండా జస్ట్ కండలు మాత్రమే పెంచారు. అక్టోబర్, నవంబర్‌లో అందుకు తగ్గ వర్కవుట్స్ చేసి, మజిల్ పవర్ పెంచారు.
 
సల్మాన్‌ఖాన్ ఇప్పటివరకూ వర్క్‌వుట్స్‌ను మిస్ చేసిన దాఖలాలు లేవు. ఎంత బిజీగా ఉన్నా  సరే రోజుకు కనీసం మూడు గంటలైనా సరే జిమ్ చేయాల్సిందే.  ఫర్ సపోజ్ ఏ రోజైనా వీలు కాకపోతే మర్నాడు తెల్లవారుజామున రెండు గంటల టైమ్‌కు కూడా చేస్తారట.
 
సుల్తాన్ కోసం ‘ఎమ్‌ఎమ్‌ఎ’ చేశారు సల్మాన్. అంటే మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ అన్నమాట. ఫిట్‌నెస్‌లో ఇదో రకం అంటున్నారాయన. వారంలో ఐదు రోజులు ప్రతి రోజూ ఆరేడు గంటలు ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. ఫలితంగా నా బ్యాక్, నెక్ గాయపడ్డాయనీ, అయినా ఫర్వాలేదని కూల్‌గా అన్నారు సల్లూభాయ్. ‘సుల్తాన్’ కోసం సల్మాన్ తీసుకున్న డైట్ గురించి చెప్పాలంటే..
 
 ప్రీ-వర్కవుట్
 రెండు ఎగ్ వైట్స్, ఎమైనో యాసిడ్ టాబ్లెట్స్, ప్రొటీన్ షేక్

 పోస్ట్-వర్కవుట్
 ఆల్మండ్స్, ఓట్స్, త్రీ ఎగ్ వైట్స్, ప్రొటీన్ బార్

 బ్రేక్‌ఫాస్ట్
 నాలుగు గుడ్లు.. దాంతో పాటు లో ఫ్యాట్ మిల్క్

 లంచ్
 వెజ్ సలాడ్, అయిదు చపాతీలు

 స్నాక్స్
 ప్రొటీన్ బార్, నట్స్, ఆల్మండ్స్

 డిన్నర్
 వేగన్ సూప్, ఫిష్ లేదా చికెన్, రెండు ఎగ్ వైట్స్.
 తగ్గడం కోసం తిండి తగ్గించేశారు. వర్కవుట్స్ డోస్ పెంచారు.
 
 ప్రభాస్ వర్కవుట్స్
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ బరువు 100 కేజీల లోపే. ఆ చిత్రం కోసం 30 కేజీలు అదనంగా పెరిగారు. మొత్తంగా 130 కేజీలు అన్నమాట 

ఇప్పుడు ‘బాహుబలి: ది కన్‌క్లూషన్’ కోసం మరో 20 కేజీలు పెరిగారట. అంటే.. 150 కేజీలు.ప్రతి రోజూ 42 ఎగ్ వైట్స్, పావుకిలో చికెన్, తాజా పండ్లు కంపల్సరీ. ఓట్స్ బ్రౌన్ రైస్, పాస్తా, సలాడ్స్, బ్రోకొలి వంటివి ఉండాల్సిందే. ఇవన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా రోజు మొత్తంలో ఏడుసార్లు తీసుకుంటారు. ఏం తీసుకున్నా ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ తన శరీరానికి తగ్గట్టుగా ఉండేలా కేర్ తీసుకుంటారు 

తిండి బాగా తింటే బరువు పెరుగుతాం. కండలు కావాలంటే వర్కవుట్స్ చేయాల్సిందే. ‘బాహుబలి’కి ముందు ప్రభాస్ అమెరికా వెళ్లినప్పుడు, అక్కణ్ణుంచి జిమ్ ఎక్విప్‌మెంట్ తెచ్చుకున్నారు. డంబుల్స్, స్ట్రెచింగ్, క్రాస్ ఫిట్స్, ప్లయోమెట్రిక్స్, యోగ వంటివి దినేష్ అనే ట్రైనర్ ఆధ్వర్యంలో ఉదయం గంట నుంచి గంటన్నర, సాయంత్రం గంట నుంచి గంటన్నర వర్కవుట్స్ చేస్తారు. వర్కవుట్స్ చేశాక ప్రొటీన్ పౌడర్ తీసుకుంటారు.
 
 రానా వర్కవుట్స్
‘బాహుబలి’కి ముందు రానా బరువు 86 కిలోలు. ఈ చిత్రం కోసం దాదాపు 40 కిలోలు పెరిగారు 

ప్రభాస్, రానాకి ట్రైనింగ్ ఇచ్చింది దినేషే. ‘బాహుబలి’ షూటింగ్ ఆరంభించే ఆరు నెలల ముందే ట్రైనింగ్ మొదలుపెట్టారు

ఉదయం నిద్రలేవగానే రానా కార్డియో ఎక్సర్‌సైజ్ చేస్తారు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్. అక్కణ్ణుంచి ప్రతి రెండు గంటలకోసారి ఏదో ఒకటి తింటారు. ముందు కార్బోహైడ్రేట్స్, ఆ తర్వాత దాదాపు ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటారు.  40 ఎగ్ వైట్స్, చికెన్, వెజిటెబుల్ సలాడ్స్, రైస్, ప్రొటీన్ పౌడర్ వంటివి తీసుకుంటారు. మొత్తం మీద జీవితంలో ఎప్పుడూ తిననంత భారీగా తినడం విశేషం 

ప్రతి రోజూ రెండున్నర గంటలు వెయిట్ ట్రైనింగ్‌తో పాటు నాలుగు గంటలు రిహార్శల్‌కు కేటాయిస్తారు. ‘బాహుబలి’ రెండు భాగాలకు ఇదే ప్లాన్ 

‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ కోసం కండలు పెంచిన రానా ‘ఘాజి’ కోసం తగ్గించాల్సి వచ్చింది. దానికోసం తక్కువ మోతాదులో ప్రొటీన్స్ తీసుకున్నారు.
 
 ఆమిర్ కసరత్తు
బాలీవుడ్‌లో ఆమిర్‌ని అందరూ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అంటారు.‘గజిని’ (2008) సినిమా కోసం తొలిసారిగా సిక్స్ ప్యాక్ అంతు చూశారాయన. దీనికోసం అప్పట్లో 13 నెలలు కష్టపడ్డారు. ఇప్పుడు ‘దంగల్’ కోసం మల్లయోధునిగా తయారయ్యారు. భారత  రెజ్లింగ్ వీరుడు, ఒలింపిక్స్ సీనియర్ కోచ్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ‘దంగల్’ని రూపొందిస్తున్నారు.  కానీ, మల్లయోధుడిగా కనిపించాలంటే మాటలు కాదు. పైగా ఈ చిత్రంలో రెండు భిన్న పార్శ్వాల్లో కనిపించాలి. 20 ప్లస్  యువ రెజ్లర్‌గా, 60 ప్లస్ వ్యక్తిగా అగుపించాలి. దాంతో పాటు అసలు సిసలైన  మల్లయోధునిలా మెస్మరైజ్ చేయాలి. అలా చేయాలంటే బరువు పెరగాలి. ‘దంగల్’ కమిట్ కాకముందు ఆమిర్ బరువు 68 కిలోలు. ఈ సినిమా కోసం 30 కిలోలు పెరిగారు. అంటే సిక్ట్సీ ప్లస్ క్యారెక్టర్‌లో 98 కిలోల బరువుతో కనిపిస్తారు. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ ఆమిర్ వెయిట్ పెరిగే పనిలో పడ్డారు. ఈ నాలుగు నెలల కాలంలో ఆమిర్ ఏం చేశారంటే...
 
 సెప్టెంబర్ టు డిసెంబర్..
 వెయిట్ గెయిన్

ఉదయం ఆరుగంటల నుంచి ఎనిమిదిన్నర వరకూ నడకతో తన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేవారు. వాకింగ్ పూర్తి కాగానే బ్రేక్‌ఫాస్ట్.
 
♦  కొన్నాళ్ల క్రితం ఆమిర్ వేగన్ (జంతు ఉత్పత్తులు తీసుకోరు. కనీసం పాలు కూడా తాగరు)గా మారారు. అందుకని వెజిటేరియన్ డైట్ మాత్రమే తీసుకునేవారు. రోజుకు 9 సార్లు ఆహారం తీసుకునేవారు..
 
♦  వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా ఇవన్నీ ఆమిర్  దినచ ర్యలో తప్పనిసరి.  మొత్తం మీద తాను అనుకున్నట్లుగా నాలుగు నెలల్లో బరువు పెరిగారు.
 
♦  మిడిల్ ఏజ్ సీన్స్ తీశాక యంగ్ మహావీర్‌కి సంబంధించిన సీన్స్ తీయాలనుకున్నారు. కానీ, బరువు తగ్గాలి కదా. బరువు పెరగడానికి 4 నెలలు తీసుకున్నట్లుగానే తగ్గడానికి కూడా 4 నెలలే తీసుకున్నారు ఆమిర్.
 
 జనవరి టు ఏప్రిల్..
 వెయిట్ లాస్

బరువు తగ్గాలనుకున్న తర్వాత ఆమిర్ తిండి తగ్గించేశారు. రోజుకి 1500 కేలరీలకు సరిపడా ఫుడ్ మాత్రమే తీసుకునేవారు. కానీ 4,500 కేలరీలు కరిగించేవారు. దీనికోసం బైకింగ్, ట్రెకింగ్, స్విమ్మింగ్... ఇలా బోల్డన్ని యాక్టివిటీస్ చేశారు. రోజులో ఆరేడు గంటలు వీటికే కేటాయించేవారు.
 
వెయిట్ తగ్గడం కోసం ఆమిర్ తన నియమాన్ని కూడా సడలించుకోవాల్సి వచ్చింది. వేగన్‌గా మారిన ఆయన నాన్-వెజ్ తినాల్సి వచ్చింది. ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకోమని డాక్టర్ సూచించారట. దాంతో ఫిష్ తిన్నానని ఆమిర్ పేర్కొన్నారు. మొత్తం మీద పెంచిన బరువులో 25 కిలోలు తగ్గించారు. అంటే.. యంగ్ రెజ్లర్ పాత్రలో 73 కిలోల బరువుతో కనిపిస్తారు ఆమిర్. తగ్గడం కోసం మాత్రమే చేపలు తిన్న ఆమిర్ ఆ తర్వాత మళ్లీ వేగన్ గా మారిపోయారు.
 
1990 ముందు వరకూ మన హీరోలు నిండుగా ‘ఫ్యామిలీ ప్యాక్’తో ఉండేవాళ్లు. తర్వాత తర్వాత ట్రెండ్ మారిపోయింది. హాలీవుడ్ వాళ్లను చూసి బాలీవుడ్ వాళ్లు, వాళ్లను చూసి మన తెలుగు హీరోలు... సిక్స్ ప్యాక్ కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ‘దేశముదురు’తో సిక్స్ ప్యాక్ ట్రెండ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారు అల్లు అర్జున్. ఆ తర్వాత కూడా పాత్ర డిమాండ్ చేసిన మేరకు ఫిజిక్‌ని మల్చుకుంటూ వస్తున్నారు.
 
  రీసెంట్‌గా విడుదలైన ‘సరైనోడు’లో గత చిత్రాలకన్నా ఫిట్‌గా కనిపించి, భేష్ అనిపించుకున్నారు. సిక్స్ ప్యాక్ చేసిన హీరోల జాబితాలో ప్రభాస్ కూడా ఉన్నారు. ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’లో ఆరు పలకలతో కనిపించి, అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. బాడీ మేకోవర్ విషయంలో చిన్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ఎన్టీఆర్ ఎంత బొద్దుగా ఉండేవారో చెప్పక్కర్లేదు. ఎంతో పట్టుదలతో తగ్గారు. అప్పటివరకూ బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ‘యమదొంగ’ కోసం సన్నబడ్డారు. ఆయన్ను చూసి ‘మేకోవర్ అంటే ఇదేరా’ అన్నవాళ్లు లేకపోలేదు. రీసెంట్‌గా ‘నాన్నకు ప్రేమతో’ కోసం కూడా ఆయన మేకోవర్ అయిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు.
 
‘1 నేనొక్కడినే’ కోసం మహేశ్‌బాబు కూడా సిక్స్ ప్యాక్ చేయడం ఆయన అభిమానులను ఆనందపరిచింది. ‘డైనమైట్’ సినిమా కోసం మంచు విష్ణు సిక్స్ ప్యాక్ చేశారు. దీనికోసం ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, డైనమిక్‌గా తయారయారు. బాడీ మేకోవర్ విషయంలో రామ్‌చరణ్ కూడా వెనకాడలేదు. ప్రస్తుతం చేస్తున్న తమిళ చిత్రం ‘తని ఒరువన్’ కోసం రామ్‌చరణ్ శాకాహారిగా మారిపోయారు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు కాబట్టి, బాడీని ఇంకా ఫిట్‌గా చేసుకున్నారు. సిక్స్ ప్యాక్ జాబితాలో నితిన్ కూడా ఉన్నారు.
 
ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితమే నితిన్ ఆరు పలకల దేహాన్ని ఎచీవ్ చేశారు. హీరోలందరి మేకోవర్ ఒక ఎత్తు అంటే కమెడియన్ సునీల్ మేకోవర్ మరో ఎత్తు అనాలి. హాస్యనటుడుగా రాణించి, హీరోగా మారడమే ఓ సాహసం అంటే.. సిక్స్ ప్యాక్ చేయడం మరో సాహసం. బొద్దుగా ఉండే సునీల్ సిక్స్ ప్యాక్ చేసి, ప్రశంసలు పొందారు. ఇప్పటివరకూ మనం బరువు తగ్గిన విషయం గురించే మాట్లాడుకున్నాం. పెరిగిన విషయం గురించి చెప్పాలంటే ప్రభాస్, రానా గురించి ప్రస్తావించాల్సిందే. ‘బాహుబలి’ కోసం ఈ ఇద్దరూ బరువు పెరిగిన విషయం తెలిసిందే. భారీకాయులుగా మారడానికి మామూలుగా కష్టపడలేదు.
 
ఇంకా మన టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సైతం మేకోవర్‌పై దృష్టి సారిస్తున్నారు. విక్రమ్ అయితే ‘ఐ’లోని ఓ పాత్ర కోసం గుర్తు పట్టలేనంతగా సన్నగా మారిపోయారు. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లో సూర్య టీనేజ్ కుర్రాడిగా కనిపించి, ఆకట్టుకున్నారు. ‘24’లో ఓ పాత్ర కోసం సన్నబడ్డారు. మొత్తం మీద మిడిల్ ఏజ్ హీరోలందరూ యంగ్ హీరోలకు దీటుగా మేకోవర్ అవుతున్న విషయం అభినందనీయం. ‘ఫిట్‌నెస్ వీరుల్లో’ సుధీర్‌బాబు కూడా ఉన్నారు. మామూలుగానే ఫిట్‌గా ఉండే సుధీర్ హిందీ చిత్రం ‘భాగీ’ కోసం మేకోవర్ అయిన విధానం అక్కడివారినీ ఆకట్టుకుంది. మొత్తం మీద మనవాళ్లు సూపర్ అనాలి.
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement