షాకింగ్.. సినీ సెలబ్రిటీలు ఇంత దారుణమా?
ముంబై: బాలీవుడ్ నటీనటులు సినిమాల్లో గొప్ప పాత్రల్లో కనిపిస్తుంటారు. పబ్లిక్‌లోనూ, మీడియా సమావేశాల్లోనూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతారు. సినీ కార్యక్రమాల్లో అయితే అభిమానులే దేవుళ్లు అని చెబుతుంటారు. నిజజీవితంలో కూడా వారు హుందాగా మంచితనంతో ప్రవర్తిస్తారా అంటే చాలామంది కాదనే చెప్పవచ్చు. పనిమనుషులతో బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రవర్తించే తీరు తెలిస్తే విస్మయం చెందుతారు. కొందరు మినహా చాలామంది సినీ ప్రముఖులు పనివాళ్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తారట. పనివాళ్లను కొట్టడం, తిట్టడం, సరిగ్గా భోజనం పెట్టకపోవడం, జీతం ఇవ్వకపోవడం వంటి సంఘటనలు చాలా వెలుగు చూశాయి. అయితే ఇవన్నీ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లలేదు. సినీ ప్రముఖులపై కేసు పెట్టడానికి పనివాళ్లు భయంతో వెనుకంజ వేయడమే దీనికి కారణం.
ముంబైలోని హౌస్ కీపింగ్ సర్వీస్ ప్రొవైడర్లు.. బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో పనిచేసేందుకు సిబ్బందిని పంపడానికి వెనకడుగు వేస్తున్నారు. సినీ ప్రముఖులు పెట్టేబాధలను సిబ్బంది తమతో గోడు వెళ్లబోసుకోవడమే కారణం. సిబ్బంది నుంచి వారికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. హ్యాపీ మెయిడ్స్ సర్వీస్ డైరెక్టర్ అభిషేక్ సాబ్లె మాట్లాడుతూ.. బాలీవుడ్ వాళ్లతో కాంట్రాక్టులను ఆపివేశానని చెప్పాడు. 'నా అనుభవంలో తెలిసిన మేరకు కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే మంచివారు. చాలామంది పనివాళ్లకు మంచి భోజనం పెట్టరు. ఒకవేళ వంటవాళ్లు చేసిన భోజనం నచ్చకపోతే ప్లేట్‌ను వాళ్ల మొహంపైకి విసురుతారు' అని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో ఓ సెలబ్రిటీ వంటమనిషిని కాలితో తన్ని లేపి, పనిచేయమని డిమాండ్ చేశాడని సాబ్లె వెల్లడించాడు. మరో నటుడు పనిమనిషిపై తప్పుడు దొంగతనం కేసు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లానని, బాధితురాలు తనకు తెలిసిన మంత్రితో గోడు వెళ్లబోసుకోవడంతో కేసును కొట్టివేశారని తెలిపాడు. ఓ మరాఠీ నటి కులం విషయంలో గొడవ పడుతుందని, తనకు అంబేడ్కర్ కులానికి చెందినవాళ్లు వద్దని షరతు పెట్టిందని చెప్పాడు. ఓ సారి ఆమె తనను హత్య చేయిస్తానని బెదిరించిందని, ఓ మంత్రితో కూడా ఫోన్ చేయించిందని సాబ్లే తెలిపాడు.
సినీ ప్రముఖులు సరిగా జీతాలు చెల్లించరని, వారిని మూడ్‌ను బట్టి ప్రవర్తిస్తుంటారని ఓ సర్వీస్ ప్రొవైడర్ చెప్పాడు. పోలీసు కేసు పెడతామన్నా వాళ్లు భయపడరని, పోలీసులు కూడా ఈ విషయంలో సాయం చేయరని తెలిపాడు. ఇలాంటి ఘటనలు పెద్ద స్టార్‌ల నుంచే గాక చిన్న నటులు, మోడల్స్, టీవీ నటుల నుంచి కూడా తమకు ఎదురవుతుంటాయని వాపోయాడు. బుక్ మై బాయ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ సిన్హాల్ మాట్లాడుతూ.. 'బాలీవుడ్ ప్రముఖులు పనివాళ్లను దారుణంగా తిడతారు. కొడతారు. నెలల కొద్దీ జీతాలు ఇవ్వరు. ఇలాంటి వాళ్లలో జాతీయ అవార్డు విజేతలు, రోల్ మోడల్స్ కూడా ఉన్నారు. వారి పేరు చెబితే నా కంపెనీపై పరువు నష్టం కేసు వేస్తారు. ఇలాంటి సందర్భాల్లో నా సిబ్బంది నా వెంట ఉండాలి. పోలీసు స్టేషన్‌కు వెళ్లి వాళ్లపై కేసు పెట్టాలి. లేకపోతే నేను చేయగలినది ఏమీ లేదు. పనివాళ్లు పోలీసు కేసు పెట్టడానికి వెనుకాడుతారు. ఎందుకంటే వాళ్లు బతకడం కోసం, డబ్బు సంపాదించేందుకు వచ్చారు. కేసులు, గొడవలు తమకెందుకని భయపడుతారు' అని చెప్పాడు.