ఎండల్లో హాయ్.. హాయ్..! | bollywood heroines saumur Care | Sakshi
Sakshi News home page

ఎండల్లో హాయ్.. హాయ్..!

Published Mon, Apr 6 2015 11:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఎండల్లో హాయ్.. హాయ్..! - Sakshi

ఎండల్లో హాయ్.. హాయ్..!

 బాలీవుడ్
 చల్లటి వాతావరణం చల్లగా జారుకుంది. ‘ఇన్నాళ్లూ కూల్ కూల్‌గా ఉన్నారు కదా... ఇప్పుడు చూపిస్తా  నా తడాఖా’ అంటూ సూర్యుడు చెలరేగిపోతున్నాడు. భానుడి భగభగలకు ఎలాంటివారైనా భయపడాల్సిందే.  తాకితే కందిపోయే అందాల తారలనూ కనికరించడాయె. ఈ సూరిబాబు ముందు ఎవరైనా ఒకటే.  ఈ ఎండల్లోనూ అందం, ఆరోగ్యం బాగుండాలంటే, జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం. ముఖ్యంగా
 వెండితెర భామలైతే మరింత జాగ్రత్తపడాలి. వాళ్లు డల్‌గా కనిపిస్తే అభిమానులు ఫీలైపోతారు కదా.  అందుకే, వేసవిలో కథానాయికలు మరీ జాగ్రత్తగా ఉంటారు. సెగలు కక్కుతున్న సూర్యుడి తాపం  తట్టుకోవడానికి మన ప్రసిద్ధ హిందీ సినీ కథానాయికలు ఏం చేస్తారో... వారి మాటల్లోనే తెలుసుకుందాం.
 
 జలకాలాటకు అరగంట! : నర్గిస్ ఫక్రీ
 వేసవి అంటే నాకు అగ్ని పరీక్ష లాంటిదే. ఎందుకంటే, నా స్కిన్ చాలా సెన్సిటివ్. ఇలా ఎండలో వెళితే అలా కమిలిపోతుంది. అందుకే, రసాయనాలు ఎక్కువ ఉన్న క్రీములు కాకుండా తేలికపాటి మాయిశ్చరైజర్లు వాడతాను. కొబ్బరి నూనెతో చర్మాన్ని మర్దన చేస్తాను. విడి రోజుల్లో ఓ పది, ఇరవై నిమిషాల్లో స్నానం చేస్తే.. వేసవిలో మాత్రం అరగంటైనా నా జలకాలాట సాగుతుంది. వీలు కుదిరితే రోజుకి మూడుసార్లు లేకపోతే ఉదయం, రాత్రి స్నానం చేస్తాను. ఈ సీజన్‌లో అవుట్‌డోర్ షూటింగ్‌లు ఉండకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా.
 
 చురుక్కుమన్నా.. ఎంజాయ్ చేయొచ్చు :  కరీనా కపూర్ 
 ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టగానే ఎండ చురుక్కుమన్నప్పటికీ... చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా దుస్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. స్వచ్ఛమైన కాటన్ దుస్తులు వాడితే శరీరానికి హాయిగా ఉంటుంది. వేసవి కాలం వస్తోందంటే నేను ప్రత్యేకంగా కొన్ని దుస్తులు కొనుక్కుంటా. అలాగే, సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటికి అడుగుపెట్టను. చలువ కళ్లద్దాలు లేకుండా అస్సలు బయటికి వెళ్లను. వేసవిలో నేను చాలా తక్కువ మేకప్ వేసుకుంటా. జుత్తు గురించి అదనపు శ్రద్ధ తీసుకుంటా. దుమ్ము, ధూళికీ జుత్తు పాడైపోతుంది. అందుకే ఎస్‌పిఎఫ్ ఉన్న షాంపూ ఉత్పత్తులను వాడతాను. స్కూల్ డేస్‌లో వేసవి సెలవులకు అలవాటుపడినందునో ఏమో ఇప్పుడు కూడా వేసవి అంటే హాలీడే మూడ్‌లోకి వెళ్లిపోతా. ఈ సీజన్‌లో షూటింగ్స్‌కి డమ్మా కొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. ఒకవేళ షూటింగ్ లేకపోతే నేనెక్కడికి వెళతానో తెలుసా? బీచ్‌లున్న ప్రదేశాలకు వెళ్లిపోతాను. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తా. కానీ, సన్ స్క్రీన్ లోషన్ రాసుకునే వెళతాను సుమా. ఈ సీజన్‌లో ఆహార పరంగా నేను పెద్దగా నియమాలేవీ పెట్టుకోను. కానీ, నీళ్లు ఎక్కువ తాగుతాను. జ్యూసులు బాగా తీసుకుంటాను.
 
 సమ్మర్.. సో నైస్  :  కత్రినాకైఫ్
 అన్ని సీజన్ల కన్నా నాకు వేసవి అంటే చాలా ఇష్టమని చెబితే కొంతమందికి వింతగా ఉంటుందేమో. చలికాలంలో దుప్పటి ముసుగు తన్ని నిద్రపోవాలనిపిస్తుంది. వర్షాకాలంలో కాలు బయటపెట్టడం కష్టం. అదే ఎండాకాలంలో అయితే సమస్యే లేదు. హాయిగా బయటికెళ్లచ్చు. కానీ, చర్మం కమిలిపోతుంది కదా అంటున్నారా? అందుకే, తేనె ఉన్న ఫేస్ ప్యాక్‌లు కొనుక్కోవాలి. అలాగే, సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. మిగతా సమయంలో ఎలా ఉన్నా, వేసవిలో నేను మూడు, నాలుగు సార్లు మొహం కడుక్కుంటాను. ముఖ్యంగా అవుట్‌డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు ఎండలకు అలసిపోకుండా ఉండడం కోసం పుచ్చకాయ జ్యూస్, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటాను. మజ్జిగ కూడా చాలా మేలు చేస్తుంది. మసాలా కూరలు, వేపుళ్లు తినను. శరీరం తేలికగా అనిపించే ఆహారం తీసుకుంటా.
 
 ఎండ వేళ బీచ్‌లో హాయిగా  :
  బిపాసా బసు
 ప్రతి ఏడాదీ వేసవిలో వీలు కుదిరినంతవరకూ బీచ్‌లకు వెళతాను. నా ఫేవరెట్ ప్లేస్ - గోవా. కానీ, ఎండల్లో బీచ్‌కెళితే సూర్యుడు తన ప్రతాపం చూపించేస్తాడు. అందుకే మొహానికి ముసుగు వేసుకుంటాను. దీనివల్ల రెండు సౌలభ్యాలున్నాయి. ఎండకు నా మొహం పాడవ్వదు.. నన్నెవరూ గుర్తు పట్టరు. ఈ సీజన్‌లో బత్తాయిలు, కమలా పండ్ల రసం బాగా శక్తినిస్తుంది. కానీ, నాకు నిమ్మజాతి పండ్లు పడవు. అందుకని, ఈ పండ్లకు దూరం. కొబ్బరి నీళ్లు, దానిమ్మ జ్యూస్‌లు తీసుకుంటాను. ఇంకా ఆకుపచ్చ కూరగాయలతో చేసిన ఏ జ్యూస్ అయినా ఆరోగ్యానికి మంచిదే. వేసవిలో ఎక్కువగా ద్రవ పదార్థాల మీదే ఆధారపడతాం కాబట్టి, ఈ జ్యూసులు తీసుకోవడం మంచిది.
 
 బాగా నూనె పట్టించేస్తా  : అలియా భట్
 సమ్మర్ అనగానే నాకు ముందు గుర్తొచ్చేది ఎండ కాదు.. మామిడి పండ్లు. మామూలుగా నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ‘ఏంటి ఫ్రూట్స్ తినే బతికేస్తావా?’ అని ఆటపట్టిస్తుంటారు. చెర్రీస్, స్ట్రాబెర్రీ, ద్రాక్ష.. ఇలా అన్నీ తింటాను. వేసవిలో మాత్రం మామిడి పండ్లే తింటాను. రోజుకో పండు తిననిదే నాకు నిద్రపట్టదు. ఇక, వేసవిలో నేను చేసే మరో విషయం ఏంటో చెప్పనా? మిగతా అన్ని సీజన్స్‌లో నా జుత్తును స్వేచ్ఛగా వదిలేస్తాను. కానీ, సమ్మర్‌లో మాత్రం టైట్‌గా పోనీటెయిల్ వేసుకుంటా. దీనికోసం ‘బటర్‌ఫ్లై క్లిప్’నే వాడతా. ఈ సీజన్‌లో నా చర్మం సంగతెలా ఉన్నా జుత్తు మాత్రం చాలా ఎండిపోయినట్లుగా అయిపోతుంది. అందుకే వారంలో రెండు సార్లయినా బాగా నూనె పట్టించేస్తా. ఆ తర్వాత మంచి షాంపూతో ఆ జిడ్డు అంతా వదిలించేస్తా. అలాగే, బయటికి వెళితే వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళతా. వేసవిలో నీళ్లు ఎక్కువ తాగాలి. కాటన్ దుస్తులు, చలువ కళ్లద్దాలు.. ఇలా సమ్మర్‌కి అనువుగా ఉండే దుస్తులు, వస్తువులు వాడతాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement