తనలో నటుడు దాగున్నాడన్న విషయాన్ని మొదట గుర్తించింది మా అమ్మే అంటున్నాడు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ. గువాహటిలో జరుగుతున్న బ్రహ్మపుత్ర వ్యాలీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బొమన్ ఇరానీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పొటాటో చిప్స్ షాప్ ఓనర్ స్థాయి నుంచి సినిమా నటుడిగా ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్నఅనుభవాల నుంచి వెల్లడించాడు.
పక్కింటావిడకు నేనే టార్గెట్...
‘చిన్నపుడు చాలా బిడియంగా ఉండేవాడిని. భయం కారణంగా నత్తి కూడా వచ్చేది. దీంతో ఎక్కువగా మాట్లాడే వాడిని కూడా కాదు. అందుకే మా పక్కింట్లో ఉండే ఆవిడ ఎప్పుడూ నన్ను టార్గెట్ చేసేవారు. వాళ్ల పిల్లలు నాకంటే చాలా బెటర్ అని నిరూపించేందుకు.. నా ఈ లోపాన్ని మా అమ్మ ముందు ప్రస్తావించేవారు. పాపం బొమన్.. ఇలా అయితే కష్టం అంటూ నన్ను కామెంట్ చేసేవారు. దీంతో మా అమ్మకు నా భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది అని బొమన్ వ్యాఖ్యానించాడు.
అలా ధైర్యవంతుడిగా మారాను
‘నాకు చదువుపై శ్రద్ధ లేదని మా అమ్మ ముందుగానే గుర్తించింది. అందుకే సినిమాలు చూడమని ప్రోత్సహించేది. అల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినిమాలు చూడమని ఓ రోజు డబ్బులు ఇచ్చింది. అప్పుడు నా వయసు పదకొండేళ్లు. దీంతో ఆ థియేటర్ వాళ్లు నన్ను లోపలికి రానివ్వడం లేదని చెప్పాను. మా అమ్మ వెంటనే ఆ థియేటర్ మేనేజర్‌కు లేఖ రాసింది. నన్ను సినిమా చూడనివ్వాలని కోరింది. అలా అప్పటి నుంచి ఒంటరిగా బయటికి వెళ్లడం మెల్లగా మెల్లగా అలవాటైంది. ముద్దపప్పులా ఉండే నేను చాలా ధైర్యవంతుడిగా మారాను. ఆ తర్వాత నాటకాలు చూసేందుకు వెళ్లేవాడిని. ఆర్టిస్టుల హావభావాలు క్షుణ్ణంగా పరిశీలించేవాడిని. అమ్మ కూడా కొన్ని చిట్కాలు చెప్పేది. అలా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో సుమారు 14 ఏళ్లు థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగాను. ఆ తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టాను. ప్రస్తుతం విజయవంతమైన నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నా’ అని బొమన్ చెప్పుకొచ్చాడు. ఆర్థిక కారణాల దృష్ట్యా కొన్నాళ్లు పొటాట్ చిప్స్ షాప్ ఓనరుగా, మరికొన్నాళ్లు ముంబై తాజ్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment